అమ్మంటే అంతేమరి : భారీ వర్షం..పొత్తిళ్లలో బిడ్డ..10కిలో మీటర్లు నడక  

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 11:12 AM IST
అమ్మంటే అంతేమరి : భారీ వర్షం..పొత్తిళ్లలో బిడ్డ..10కిలో మీటర్లు నడక  

అమ్మ..అమ్మ..అమ్మ.. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. లోకమంతా ఒక ఎత్తు అమ్మ ప్రేమ మరో ఎత్తు. బిడ్డ కోసం అమ్మపడే తపన అంతా ఇంతా కాదు. బిడ్డకు చిన్నపాటి నలత చేసిన అమ్మ హృదయం ద్రవించిపోతుంది. నిద్రహారాలు మాని బిడ్డను గుండెల్లో దాచుకుని కాపాడుకుంటుంది. అటువంటి ఓ అమ్మ అనారోగ్యంతో ఉన్న బిడ్డ కోసం కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 10 కిలోమీటర్ల దూరం కాలినడకతో వచ్చి ఆస్పత్రికి చేరుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని అక్కల్కవా పరిధిలో చోటుచేసుకుంది. 
 
భారీ వర్షాలతో మోల్గీ- అక్కల్కువా రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. వాహనాలు వెళ్లేందుకు అవకాశంలేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితిలో సాత్పురా కొండప్రాంతానికి చెందిన ఒక మహిళ అనారోగ్యం బారిన పడిన తన కుమారుడిని ఎత్తుకుని 10 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి కాలినడకన వచ్చింది. ఇంత శ్రమపడ్డా ఆ తల్లి మోములో ఎటువంటి అలసటా కనిపించలేదు. బిడ్డ బాగుంటే చాలు అనే తపనే కనిపించింది. 

నిఝర్ తహసీల్ పరిధిలతో గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో తెలను సైతం ధ్వంసమయ్యాయి. ఈ కోవలోనే దేవర్‌గుల్లర్ నుంచి ఆమలీబార్ మధ్యనున్న రోడ్డు ధ్వంసం కావడంతో ఆదివాసీలు 10-12 కిలోమీటర్ల దూరం నడవాల్సివస్తోంది. దేవర్ గుల్లర్ ఆమ్లీబారీ కొండలపై భారీ వర్షం కురుస్తున్నప్పటికీ..గొడుగు వేసుకుని  తన కుమారుడిని ఎత్తుకుని ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ చికిత్స చేయించిన అనంతరం ఆ చిన్నారి అనారోగ్యంబారి నుంచి కోలుకున్నాడు. దాంతో ఆ తల్లి పడిన శ్రమకు..తపనకు..ఆందోళనకు ఫలితం దక్కింది. బిడ్డను గుండెలకు పొదువుకుని మురిసిపోయింది. ముద్దులతో ముంచెత్తింది. దేవుడా నాబిడ్డను బ్రతికించావు తండ్రీ అంటూ దణ్ణం పెట్టుకుంది. కానీ దేవుడు అన్ని చోట్ల ఉండలేని అమ్మను సృష్టించాడు అని ఆ అమాయక తల్లికి తెలిసిఉండదేమో. 

ఈ అమ్మ పరిస్థితేకాదు దేశంలో ఎన్నో ప్రాంతాలు చిన్నపాటి వర్షం పడితే చాలు..ప్రాణాప్రాయం వచ్చినా వైద్యం అందని దుస్థితిలో ఉన్నాయి. అభివృద్దిలో భారత్ దూసుకుపోతోందని గప్పాలు కొట్టే నాయకులను ఇటువంటి ప్రాంతాల్లో వదిలేస్తే..అభివృద్ధి చేసేస్తున్నాం అని చెప్పటానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితికి గురవ్వాల్సిందే.