బుడ్డా వర్సెస్ శిల్పా : శ్రీశైలంలో నువ్వా నేనా

కర్నూలు : శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలోని నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ప్రజలకు అంతు చిక్కడం లేదు. 2019

  • Edited By: veegamteam , February 3, 2019 / 04:11 PM IST
బుడ్డా వర్సెస్ శిల్పా : శ్రీశైలంలో నువ్వా నేనా

కర్నూలు : శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలోని నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ప్రజలకు అంతు చిక్కడం లేదు. 2019

కర్నూలు : శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలోని నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ప్రజలకు అంతు చిక్కడం లేదు. 2019 ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. నువ్వా-నేనా అనే రీతిలో ప్రచారాలు సైతం ప్రారంభించాయి. 2009లో జరిగిన పునర్విభజనలో భాగంగా ఏర్పడిన శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 2014 ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థులే 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, వైసీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి బరిలో దిగుతున్నారు. ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు ఇద్దరూ ఇప్పటి నుంచే పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపి, జనసేన పార్టీలు ఇప్పటి దాకా అభ్యర్థులను కాదు కదా.. నియోజకవర్గ ఇంఛార్జ్‌లను కూడా ప్రకటించలేదు.

 

2009 వరకు ఆత్మకూరు పరిధిలో ఉన్న శ్రీశైలం.. పునర్విభజన తర్వాత నియోజకవర్గంగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన శ్రీశైలం నియోజకవర్గంలోకి ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం మండలం, నంద్యాల నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు, మహానంది మండలాలు వచ్చి చేరాయి. శ్రీశైలం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు బరిలో దిగాయి. అప్పట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సతీమణి బుడ్డా శైలజా, కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి, పీఆర్పీ నుంచి బుడ్డా శేషురెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏరాసు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలో టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేయగా, బుడ్డా రాజశేఖర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయించి సైకిలెక్కారు. దీంతో శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డికి, ఎమ్మెల్యే బుడ్డాకు మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది.

 

భూమా నాగిరెడ్డి అకాల మరణంతో నంద్యాల ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో శిల్పా కుటుంబానికి కాకుండా భూమా కుటుంబానికి టీడీపీ టికెట్ ఇవ్వడంతో శిల్పా సోదరులు వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. మరోవైపు బుడ్డారాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బుడ్డా శేషిరెడ్డిని నియమించారు. తర్వాత బుడ్డా శేషిరెడ్డిని తొలగించి శిల్పా చక్రపాణిరెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

 

2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తిని ఆయుధంగా మలుచుకొని శిల్పాచక్రపాణిరెడ్డి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే.. బుడ్డా మాత్రం తెలుగుదేశం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.