ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత ఫలితాలు రిపీట్ అవ్వకుండా కేసీఆర్ ముందు జాగ్రత్త

  • Published By: naveen ,Published On : October 7, 2020 / 04:12 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత ఫలితాలు రిపీట్ అవ్వకుండా కేసీఆర్ ముందు జాగ్రత్త

cm kcr: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. ప‌ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేర్‌లెస్‌గా ఉండొద్దంటూ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారు. హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మహ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్లగొండ-ఖ‌మ్మం-వరంగ‌ల్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీకి తిరుగులేదని చాటి చెప్పాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని నేతలకు సలహా ఇచ్చారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మనకే అనుకూలంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయని టీఆర్ఎస్‌ అధినేత చెబుతున్నారు.

టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నదే కేసీఆర్‌ ఉద్దేశం:
రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా నిరుద్యోగులు, యువకులు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నదే కేసీఆర్‌ ఉద్దేశంగా చెబుతున్నారు. కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఇలాంటి వ్యవహారాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాకపోతే గత అనుభవాల కారణంగా ఈసారి కేసీఆర్.. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలపై దృష్టి పెట్టారని టాక్‌.

గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అనూహ్య విజయం:
కొన్నేళ్ల క్రితం మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అప్పట్లో టీఆర్ఎస్ దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. గతేడాది ఉమ్మడి మెదక్-కరీంనగర్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఈ విషయంలో టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ కాస్త అసంతృప్తి చెందారని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఓటమి పాలైన మూడు నెలల వ్యవధిలోనే ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి విజయం సాధించడంతో టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చినట్టయ్యింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలను లైట్ తీసుకోవద్దని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వొద్దు:
ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోతే.. నిరుద్యోగులు, యువత టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారాన్ని విపక్షాలు మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రతిపక్షాలకు అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఆయన. ఈ రెండు స్థానాలను గెలుచుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీలను నోరు విప్పకుండా చేయవచ్చని అంచనా వేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి కేసీఆర్‌ కోరుకున్నట్టుగా అంతా సవ్యంగా జరుగుతుందా? పాత ఫలితాలే పునరావృతం అవుతాయా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.