త్వరలోనే JBS To MGBS Metro Rail

  • Published By: madhu ,Published On : January 13, 2020 / 12:59 AM IST
త్వరలోనే JBS To MGBS Metro Rail

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో కారిడార్ కు భద్రతపరమైన తుది అనుమతులు వచ్చాయి. దీంతో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మరికొద్ది రోజుల్లోనే మెట్రో రైల్ పరుగులు పెట్టనుంది. నగరంలో రెండు ప్రధాన బస్ స్టేషన్లకు అనుసంధానంగా చేపట్టిన ఈ మార్గంలో గత 45 రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ నెలలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇప్పటికే మొదటి కారిడార్ మియాపూర్ నుంచి ఎల్బీనగర్, మూడు కారిడార్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ప్రయాణికులతో మెట్రో పరుగులు పెడుతోంది. మిగిలిన రెండో కారిడార్ లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గత నవంబర్ 25నుండి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

ఈ మార్గంలో భద్రతాపరమైన 18 తనిఖీలను మెట్రో రైలు అధికారులు పరిశీలించారు. అలాగే మెట్రో రైలు సేఫ్టీ విభాగానికి పంపించడంతో భద్రత కమిషనర్ జేకే గార్గ్ ఎగ్జామిన్ చేశారు. సాధారణ వేగం, అధిక వేగంతో ట్రైన్ మూవ్ మెంట్ ను తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా, ట్రాక్, సిగ్నలింగ్, రైళ్లకు సంబంధించిన భద్రతా పరీక్షలను క్షుణ్ణంగా పరిశీలించి మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి తుది అనుమతుల పత్రాన్ని అందజేశారు. 
 

* కారిడార్-1లో మియాపూర్ నుంచి ఎల్బీనగర్
* కారిడార్-3లో నాగోల్ నుంచి రాయదుర్గం
* బేజీఎస్ నుంచి ఎంజీబీఎస్ కు ట్రయల్ రన్
* క్షుణ్ణంగా పరిశీలించిన భద్రతా కమిషనర్
* మెట్రో రైల్ ఎండీకి తుది అనుమతుల పత్రం

రెండో కారిడార్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆస్పత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుల్తాన్ బజార్ మీదుగా ఎంజీబీఎస్ చేరుకుంటుంది. ఇందులో మిగతా కారిడార్లను రెండు చోట్ల దాటుకొని వెళుతుంది. రెండు, మూడు కారిడార్లకు పరేడ్ గ్రౌండ్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ కాగా.. ఒకటి, రెండు కారిడార్లకు ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ ఉంటుంది. కోఠిలోనూ స్టేషన్లు సమీపంలోనే ఉన్నాయని.. చిన్న మార్గమే అయినా కీలక మార్గమని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఈ కారిడార్ కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికులు అన్ని చోట్లకు వెళ్లేందుకు సులువుగా ఉంటుందన్నారు. 

* ఇప్పటివరకు 57 కిలో మీటర్ల మార్గంలో మెట్రో సేవలు. 
* కారిడార్ 2లో అందుబాటులోకి 11 కిలోమీటర్లు. 
* మొత్తంగా 68 కిలోమీటర్ల మార్గంలో మెట్రోలో ప్రయాణం. 
* ఈ నెల చివరలో కారిడార్ 2ను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు. 

ఇప్పటికే రోజుకు 4 లక్షల మంది మెట్రో సేవలు పొందుతున్నారు. ఈ కారిడార్ కూడా అందుబాటులోకి వస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కొంత మేర ట్రాఫిక్ కూడా తగ్గుతుందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More : ఊరెళ్లే దారేది : హైదరాబాద్ రోడ్లు ఖాళీ