కేజ్రీవాలే ఆదర్శం.. కేడర్‌కు కోదండరాం క్లాసులు!

  • Published By: sreehari ,Published On : February 18, 2020 / 03:29 PM IST
కేజ్రీవాలే ఆదర్శం.. కేడర్‌కు కోదండరాం క్లాసులు!

దేశ రాజధానిలో సామాన్యుడు గెలుపే మాకు ఆదర్శం అంటున్నారు ప్రొఫెసర్ సార్.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కార్యాచరణ రూపొందిస్తే సక్సెస్ మన సొంతం అంటూ కేడర్ కు పాఠాలు బోధిస్తున్నారు. గెలుపొటములు సహజమే కానీ, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే హస్తినాలో ఆమ్ ఆద్మీలా అధికారం చేపట్టవచ్చునని అంటున్నారు. ఇప్పుడు దేశంలో అంద‌రి నోళ్లలో నానుతున్న పేరు.. ఆరవింద్ కేజ్రివాల్. వ‌రుస‌గా మూడోసారి ఢిల్లీ సీఎం పీఠం చేజిక్కించుకున్న చీపురు పార్టీ దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల‌కు రోల్ మోడ‌ల్‌గా నిలుస్తోంది.

నిరాశ వద్దు.. భవిష్యత్ మనదే :
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీకి నాయ‌క‌త్వం వ‌హించిన కోదండరాం సారు… ఇప్పుడు కేజ్రీవాల్ తమకు ఆద‌ర్శం అంటున్నారు. ఓట‌ములెన్ని వ‌చ్చినా నిరాశ చెందాల్సిన పని లేదని, భవిష్యత్‌ తమదేనని చెబుతున్నారు. కేంద్రం చేతుల్లో అనేక అవ‌మానాలు ఎదుర్కొన్న కేజ్రీవాల్ ప్రజ‌ల్లో త‌న కార్యద‌క్షత‌ను నిరూపించుకున్నారు. కేంద్రం త‌న అధికారంతో పెత్తనం చేసినా చెక్కు చెద‌ర‌ని ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డి నిల‌బడ్డారు. అదే తమకు ఆద‌ర్శమని కోదండం సారు అంటున్నారు. 

తెలంగాణలో కూడా మౌలిక అంశాలైన విద్య, వైద్యం, ఉపాధి, ఆత్మగౌరవం, ఉద్యమ ఆకాంక్షల సాధన కేంద్రంగానే రాజకీయాలు ఉండాలి. కుల-మతపరమైన భావోద్వేగాలు, అర్థబలం, అంగబలం విసిరే మాయాజాలానికి తెరపడే రోజులు వ‌స్తాయి. అప్పటి వ‌ర‌కు కాస్త ఓపిక ప‌ట్టాల‌ని ప్రొఫెసర్‌ గారు క్లాసులు తీసుకుంటున్నారట. మ‌రోవైపు ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వ‌చ్చాక చేసిన ప‌ని కాదు… అస‌లు ఆ పార్టీ నిర్మాణానికి ముందు చేసిన కార్యాచరణ గురించి భోదిస్తే బావుంటుందని కోదండం సారు పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. పార్టీని ఎలా నిర్మించాలనే విషయాలను పక్కన పెట్టి ఇవన్నీ ఎందుకని అంటున్నారట. 

కోదండం సారుకి ఎవరు చెప్తారో? :
పార్టీ స్ధాపించే కంటే ముందే కేజ్రీవాల్ త‌న స‌న్నిహితుల‌తో కలసి సిద్ధం చేసుకున్న ప్రణాళికల గురించి కోదండరాం సార్‌.. పార్టీ వాళ్లతో చర్చిస్తే బెటర్‌ అని చెవులు కొరుక్కుంటున్నారు. అంతే గానీ పార్టీ పెట్టగానే రాజ్యాధికార‌మే ల‌క్ష్యం… ప‌వ‌ర్‌లోకి రావాల‌ంటే ఎలా అని ప్లాన్‌ వేసుకొని, ఇప్పుడు మాత్రం కేజ్రీవాల్‌ ఆదర్శమని క్లాసులు చెప్తే వర్కవుట్‌ అవ్వదని కార్యకర్తలు ఎవరికీ వినిపించకుండా మాట్లాడేసుకుంటున్నారు. 

ఒక్క సారి అధికారంలోకి వ‌చ్చిన పార్టీలు.. ఆ త‌ర్వాత ఏం చేసినా ఆద‌ర్శంగానే క‌నిపిస్తాయని, అక్కడకు వెళ్లాలంటే ముందు పార్టీ నిర్మాణం సరిగా జరగాలని డిస్కస్‌ చేస్తున్నారట. అస‌లు క్షేత్రస్థాయిలో పార్టీ జెండా ప‌ట్టుకునే నాథుడే లేన‌ప్పుడు ఇవ‌న్నీ చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదని సెటైర్లు వేస్తున్నారట. మరి ఇవన్నీ కోదండం సారుకి ఎవరు చెప్తారో?