విశాఖలో అధికార పార్టీలోకి క్యూ కట్టిన ప్రతిపక్షాల నేతలు, కారణం అదేనా?

  • Published By: naveen ,Published On : October 27, 2020 / 04:28 PM IST
విశాఖలో అధికార పార్టీలోకి క్యూ కట్టిన ప్రతిపక్షాల నేతలు, కారణం అదేనా?

visakha political leaders: విశాఖ జిల్లాలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదు. గత 30 సంవత్సరాలుగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ వారసత్వాన్ని ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో ద్రోణంరాజు కుటుంబం లాగానే మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పలనర్సయ్య టీడీపీ రాజకీయాల్లో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పీవీజీ గణబాబు ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మేల్యేగా ఉన్నారు. తాజాగా గణబాబు కుమారుడు కూడా రాజకీయ ప్రవేశం చేస్తారనే ప్రచారం సాగుతోంది.

బరిలో వారసులు:
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు కుమారుడు గుడివాడ అమర్‌నాథ్‌ టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీసీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్, మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె జీవీఎంసీ బరిలో ఉండగా, మాజీ మంత్రి బాలరాజు కుమార్తె స్థానిక సంస్థల బరిలో నిలిచారు.

వయోభారం కారణంగా వారసులకు ప్రాధాన్యం:
యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు కుమారుడు సుకుమార వర్మ డీసీసీబీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన్ను కూడా బరిలో దింపడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. గాజువాక మాజీ ఎమ్మేల్యే పల్లా శ్రీనివాస్ కూడా మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం వారసుడిగానే రాజకీయాల్లోకి వచ్చారు. 37 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో తొలి తరం నేతలు సీనియర్లు కావడం, వయోభారం కారణంగా వారి రాజకీయ వారసులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

విశాఖ జిల్లాలో ఎన్టీఆర్‌తో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు అయ్యన్నపాత్రుడు. ఇప్పుడు ఆయన కుమారుడు విజయ్ నర్సీపట్నంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తెలుగుదేశం సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి వారసుడిగా ఆయన మనవడు శ్రీ భరత్ 2019 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. మరో సీనియర్ నేత అడారి తులసీరావు కుమారుడు ఆనంద్ కూడా టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

కుమారులను వైసీపీలో చేర్పించిన టీడీపీ ఎమ్మెల్యే:
ఇప్పుడు చాలామంది నేతలు వారి వారసులను రంగంలోకి దించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారంటున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొందరు నేతలు తమ కుమారులను అధికార పార్టీలోకి పంపించే ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ తన కుమారులను వైసీపీలో చేర్పించేశారు. ఆయన కూడా టీడీపీ తరఫున గెలిచినప్పటికీ ప్రస్తుతం వైసీపీకి మద్దతు పలుకుతున్నారు.

రాజకీయాల్లోకి గంటా కుమారుడు:
మాజీ మంత్రి, ప్రస్తుత విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి కూడా రాజకీయల్లోకి అరంగ్రేటం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దసరాకు ముహూర్తం ఖరారు అయ్యిందని సమాచారం. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కూడా తన కుమారుడికి అధికార పార్టీ కండువా కప్పించేస్తారని ప్రచారం సాగుతోంది. వీరే కాకుండా మాజీ మంత్రి బాలరాజు కూడా తమ కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు వీలుగా జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయించేశారు. ఈ నేతలంతా తమ వారసులను అధికార వైసీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తున్నారు. ఇప్పటికే కొందరు సక్సెస్‌ కాగా.. మరికొందరు ఆ రూట్ లో ఉన్నారు.