ఒకే కుటుంబంలో నలుగురికి టికెట్స్ : టీడీపీ హిస్టరీలో రికార్డ్‌

ఈ సారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురుకి .. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం.

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 04:17 PM IST
ఒకే కుటుంబంలో నలుగురికి టికెట్స్ : టీడీపీ హిస్టరీలో రికార్డ్‌

ఈ సారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురుకి .. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం.

శ్రీకాకుళం : రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఉండచ్చు… కానీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఒకరికో .. లేదంటే ప్రజల్లో పలుకుబడి ఉన్న కుటుంబమైతే ఇద్దరికో వస్తుంది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురుకి .. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం. బహుశా పార్టీ ఆవిర్భావం తరువాత .. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పోటీ చేసే అవకాశం రావడం ఇదే ప్రధమం. ఇంతకీ ఆ కుటుంబం ఎవరిది.. ఆ అదృష్టం దక్కించుకున్న నేతలు ఎవరు..  

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కింజారపు ఎర్రన్నాయుడిది చెరగని ముద్ర. చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా వ్యవహరిస్తూ టీడీపీ తరపున ఢిల్లీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెట్టేవారు. అయితే 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అకాలమరణం పొందిన తరువాత .. ఆ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో .. రామ్మోహననాయుడికి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో గెలుపొంది మొట్టమొదటిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు రామ్మోహన్‌నాయుడు. అంతకు ముందు ఎర్రన్నాయుడు బతికి ఉన్న కాలంలో.. ఆయన ఎంపీగా పోటీ చేస్తే, సోదరుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అదే వరవడి ఎర్రన్నాయుడు మృతి తరువాత కూడా కొనసాగింది.

ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్‌నాయుడు ఎంపీగా పోటీ చేస్తే అచ్చెన్నాయుడు యధావిధిగా శాసనసభకు పోటీ చేసి .. ఈసారి మంత్రిగా కూడా పని చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో మళ్ళీ రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం పార్లమెంటు నుంచి, బాబాయ్ అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ కుటుంబం నుంచి వీరిద్దరే కాకుండా మరో ఇద్దరు కూడా ఈ సారి రంగంలో దిగబోతున్నారు.

ఈ సారి రామ్మోహన్‌నాయుడి సోదరి భవానీ రాజమండ్రీ అర్బన్ నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భవానీ .. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు కూడా. గతంలో ఈ స్థానం పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. అయితే ఈ సారి బీజేపీతో పొత్తు లేకపోవడంతో ఈ అసెంబ్లీ స్థానం నుంచి రామ్మోహన్‌నాయుడి సోదరి ఆదిరెడ్డి భవానీని పోటీలో నిలపాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో రామ్మోహన్‌నాయుడి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వారి సంఖ్య ముగ్గురికి పెరిగింది. 

ఇక నాలుగో వ్యక్తి బండారు సత్యనారాయణ మూర్తి. వాస్తవంగా బండారు టీడీపీలో సీనియర్ నేతగా అనేక పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో చంద్రబాబు క్యాబినేట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే కొంత కాలం క్రితం ఆయన తన కుమార్తెను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడికి ఇచ్చి వివాహం చేశారు. దీంతో బండారు కుటుంబం కూడా కింజారపు కుటుంబంలో భాగమైపోయింది. ఈ సారి ఎన్నికల్లో ఆయన విశాఖ జిల్లా పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు అనుమతిచ్చారు. దీంతో ఒకే కుటంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. గెలుపే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్న చంద్రబాబు నాయుడు .. తన నియమాలన్నింటినీ పక్కన పెట్టి .. ఈ సారి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. టీడీపీ హిస్టరీలో సరికొత్త రికార్డ్ సృష్టించారు.