చంద్రబాబు కృషి ఫలిస్తుందా, టీడీపీకి ఓట్లు కురిపిస్తుందా

అమరావతి: అధికారం చేపట్టాక ఏపీలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు సీఎం చంద్రబాబు. ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రియల్‌ పార్కుల పేరుతో పెద్ద పరిశ్రమలతోపాటు చిన్న,

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 04:21 PM IST
చంద్రబాబు కృషి ఫలిస్తుందా, టీడీపీకి ఓట్లు కురిపిస్తుందా

అమరావతి: అధికారం చేపట్టాక ఏపీలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు సీఎం చంద్రబాబు. ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రియల్‌ పార్కుల పేరుతో పెద్ద పరిశ్రమలతోపాటు చిన్న,

అమరావతి: అధికారం చేపట్టాక ఏపీలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు సీఎం చంద్రబాబు. ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రియల్‌ పార్కుల పేరుతో పెద్ద పరిశ్రమలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు భారీ రాయితీలను ప్రకటించారు. నాలుగున్నరేళ్లలోనే 20కి పైగా పెద్ద పరిశ్రమలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి.. విశేష కృషి చేశారు. పారిశ్రామికంగా సాధించిన ప్రగతిని ప్రచారంలోనూ చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. మరి అవి ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి ఓట్లు కురిపిస్తాయా…?

విభజన తర్వాత ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు మరో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చారు. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రప్రభుత్వం అన్యాయం చేసినా.. సీఎం తన అనుభవంతో రాష్ట్రంలో వివిధ పరిశ్రమల స్థాపనకు నాంది పలికారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 13 జిల్లాల్లోనూ అనువైన అనుబంధ పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేశారు. ఇండస్ట్రియల్‌ పార్కుల పేరుతో పెద్ద పరిశ్రమలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు భారీ రాయితీలను ప్రకటించారు. దీంతో దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతూ వివిధ పరిశ్రమలను స్థాపిస్తున్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం నిరంతరం ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి 2016 నుంచి 2018 వరకు వరుసగా మూడేళ్లు విశాఖపట్నం కేంద్రంగా పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లను నిర్వహించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వర్గాలు, వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొన్నారు. 3 సమ్మిట్‌లకు సంబంధించి 1,437 ఎంవోయూల ద్వారా 13లక్షల 35వేల 536కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటిలో 188 ఎంవోయూల ద్వారా ఇప్పటివరకు 97వేల 537కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. 2014 నుంచి ఇప్పటివరకు 98వేల 894 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని గణాంకాలు చెబుతున్నాయి.

సమ్మిట్‌లో సంతకాలు చేసిన ఎంవోయూలకు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే 24లక్షల 60వేల 681ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సత్వర అనుమతుల కోసం సింగిల్‌ విండో విధానాన్ని ప్రవేశపెట్టారు. పాలనలో పారదర్శకతతోపాటు అధికార యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్‌ పాలసీ-2020 తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారు.

గుంటూరులో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 23వేల 430కోట్ల పెట్టుబడులు పెట్టి 500 ఉద్యోగాలు కల్పించింది. విశాఖపట్నంలో హిందూస్తాన్‌ పెట్రోలియం సంస్థ 17వేల కోట్ల పెట్టుబడులతోపాటు 3వేల 500 ఉద్యోగాలు సృష్టించింది. కర్నూలులో మెగా సీడ్‌ పార్క్‌ 13 వేల 617 కోట్ల పెట్టుబడులతోపాటు వెయ్యి ఉద్యోగాలు కల్పించింది. అనంతపురములో కియా మోటార్స్‌ సంస్థ 13వేల 500కోట్ల పెట్టుబడులు పెట్టి 11వేల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి.

ఆటోమొబైల్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న ఇసుజు సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఎన్‌హెచ్‌కే స్ప్రింగ్స్‌ కూడా పూర్తిస్థాయిలో రాష్ట్రంలో స్ప్రింగ్ ల తయారీ చేపట్టింది. నిట్టాన్‌ ఇండియా టెక్‌ అనే జపాన్‌ కంపెనీ ఇంజిన్‌ వాల్వ్‌ల తయారీలో ఉంది. వీటితోపాటు కియా మోటార్స్‌, అపోలో టైర్స్‌, హీరో మోటార్స్‌, టీవీఎస్‌ గ్రూప్‌, అశోక్‌ లే ల్యాండ్‌, భారత్‌ ఫోర్జ్‌ కూడా రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విస్తరణకు సిద్ధమవుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్‌ ఎలక్ర్టానిక్స్‌ మానుఫ్యాక్చర్‌ కంపెనీ అయిన ఫాక్స్‌ కాన్‌ రాష్ట్రంలో తయారీ ప్రారంభించింది. మొబైల్‌ ఫోన్లతోపాటు వాషింగ్‌ మెషీన్ల తయారీలో ఉన్న డిక్సన్‌ కంపెనీ కూడా ఏపీలో పూర్తిస్థాయిలో తయారీ చేపట్టింది. దేశియంగా మొబైల్స్‌ తయారీలో తనదైన ముద్ర వేసిన సెల్‌కాన్‌ కూడా యూనిట్‌ను ఏర్పాటు చేసింది. వీటితోపాటు రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌, కండెంట్‌ వంటి సంస్థలు కూడా యూనిట్ల ఏర్పాటు పనుల్లో ఉన్నాయి.

విండ్‌ పవర్‌ రంగంలో తనదైన ముద్ర వేసిన సుజ్లాన్‌ కంపెనీ రాష్ట్రంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. సంప్రదాయేతర ఇంధన వనరుల క్యాటగిరిలో ముందున్న వెల్సన్‌ ఎనర్జీ కూడా ఏపీకి వచ్చింది. విండ్‌ టర్బైన్ల తయారీలో ఉన్న గమేశ కంపెనీ కూడా ఏపీలో అడుగిడింది. సింగపూర్‌ కంపెనీ సెంబ్‌ కార్ప్‌ పవర్‌, అమెరికా కంపెనీ సన్‌ ఎడిషన్‌, గ్రీన్‌కో, హీరో ఎనర్జీ ఫ్యూచర్స్‌, రీన్యూ పవర్‌ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇక పెప్సీకో, క్యాడ్బరీస్‌, కెలోగ్స్‌ సంస్థలు ఏపీలో యూనిట్లను ప్రారంభించాయి. ఇటు టెక్స్ టైల్‌ రంగంలో షాహి ఎక్స్‌పోర్ట్స్‌, ఇండియన్‌ డిజైన్స్‌ రాష్ట్రంలో తయారీని ప్రారంభించాయి.

ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో హాస్పిర, లారస్‌ ల్యాబ్స్‌ ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. అరబిందో ఫార్మా, రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, దివిస్‌ ల్యాబ్స్‌ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇంకా ఇతర రంగాల్లో అనేక సంస్థలు తమ యూనిట్లను ఏపీలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఏపీని పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు చంద్రబాబు. మరి ఈ పారిశ్రామిక అభివృద్ధి చంద్రబాబుకు ఏ మేర ఓట్లు కురిపిస్తుందో చూడాలి.