Bhadrapada Masam 2021 : దేవతా పూజలకు..పితృదేవతల పూజకు ఉత్తమమైన మాసం భాద్రపద మాసం

భాద్రపద మాసం..దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం. 

Bhadrapada Masam 2021 : దేవతా పూజలకు..పితృదేవతల పూజకు ఉత్తమమైన మాసం భాద్రపద మాసం

Vinayaka Chaviti

Bhadrapada Masam 2021 : భాద్రపద మాసం..దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం.  ఈ మాసంలోని పౌర్ణమి తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ’భాద్రపద మాసం ’ అనే పేరు వచ్చింది.

భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం.  భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు. అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్రాలు చెపుతున్నాయి.

భాద్రపద మాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈనాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ’రాధాష్టమి’ అని పేరు. ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.

మహాలయ పక్షం :
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే ’మహాలయ పక్షం’ అని పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేను రోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడం వల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.

భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు హరితాళిక వ్రతం, సువర్ణగౌరీ వ్రతం….భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.

ఉండ్రాళ్ళ తద్ది : భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం. తెల్లవారు జామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.

వినాయక చవితి 
భాద్రపద మాసంలో  వచ్చే పండుగలలో శుక్ల చవితి నాడు జరుపుకునే వినాయక చవితి ప్రముఖమైనది. ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినాన్ని ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.

శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి…తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దినాన  ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ’పరివర్తన ఏకాదశి’ అని, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువు కాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.

శుక్ల ద్వాదశి : వామన జయంతి……దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.

శుక్ల చతుర్దశి : అనంత చతుర్ధశి … అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి…అజ ఏకాదశికే ’ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం. ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతో పాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.

కన్యా సంక్రమణం : ఈ చరాచర జగత్తుకు వెలుగును, చైతన్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడు సింహరాశి నుండి రాశులలో ఆరవదైన కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాదు. ఈ రోజు పూజలు, దానాలు చేయడంతోపాటు సూర్యభగవానుడిని, శ్రీమహావిష్ణువును పూజించవలెను.