Sri Ram Navami 2023 : ‘నవమి’ రోజే శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలు

Sri Ram Navami 2023 : ‘నవమి’ రోజే  శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలు

Sri Rama Navami 2023

Sri Ram Navami 2023 :  నాలుగు యుగాలలో రెండవది అయిన త్రేతాయుగంలో జన్మించాడు అభినవ రాముడు శ్రీరామ చంద్రుడు. పచ్చని ఆకులు స్వాగతం పలకగా.. ఇంధ్రధనస్సు రంగుల కుసుమాల గుభాళించే కాలం వసంతరుతువులో జన్మించాడు శ్రీరాముడు. వసంతకాలంలో చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. నవమి రోజు అనేది శ్రీరాముడి జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టాలు జరిగాయి.

శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో జన్మించాడు. పధ్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం, శ్రీ సీతారాముల కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయా ప్రాంతాల్లో చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడి జన్మదినం జరుపుతారు. సీతారాముల కల్యాణం అంగరంగ వైభోగంగా నిర్వహిస్తారు. అలాగే శ్రీరాముడి పట్టాభిషేకం కూడా జరుపుతారు.

కోసల దేశపు రాజు దశరథుడు. అతనికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలున్నారు. ముగ్గురు భార్యలున్నా ఒక్కరికి సంతానం కలగలేదు. దీంతో దశరధుడు వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు. యాగ ఫలంగా దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. ఇది మీ ముగ్గురు భార్యలకు ఇవ్వమని దాన్ని సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు. దీంతో దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు.

చైత్ర మాసంలో తొమ్మిదో రోజైన‘నవమి’ రోజున మధ్యాహ్నం పెద్ద భార్య కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శతృఘ్నలు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు దశవతారాల్లో ఏడోది రామావతారం. లంకాధిపతి రావణ సంహారం కోసం సాధారణ మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే కల్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. రాముడిని సూర్యవంశస్థుడు. సూర్య వంశంలో ప్రముఖలలో దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి పొందాడు. శ్రీరాముడు కూడా రఘు అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు.