Asia Cup 2022 Ind Vs Pak : వాటే మ్యాచ్.. పాకిస్తాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. ప్రతీకారం తీర్చుకుంది

ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా గెలుపొందింది.

Asia Cup 2022 Ind Vs Pak : వాటే మ్యాచ్.. పాకిస్తాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. ప్రతీకారం తీర్చుకుంది

Asia Cup 2022 Ind Vs Pak : ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో భారత్ అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది భారత్. పాక్ నిర్దేశించిన 148 పరుగుల టార్గెట్ ను భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

బౌలింగ్ లో మెరిసిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ లోనూ చిచ్చరపిడుగులా చెలరేగాడు. 17 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. పాండ్య జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. చివరలో సిక్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపు ద్వారా గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో యావత్ భారతావని మురిసింది. క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇక భారత ఇతర బ్యాటర్లలో విరాట్ కోహ్లి (34 బంతుల్లో 35 పరుగులు), రవీంద్ర జడేజా(29 బంతుల్లో 35 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 18 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ(18 బంతుల్లో 12 పరుగులు) చేశారు. కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. చివర్లో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోగా.. జడేజా, పాండ్య జోడీ ఆత్మవిశ్వాసంతో ఆడి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది.

Hardik Pandya

ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా, స్పిన్నర్ నవాజ్ బౌలింగ్ లో తొలి బంతికే జడేజా అవుటయ్యాడు. అయితే, హార్దిక్ పాండ్యా ఓ ఫ్లాట్ సిక్స్ తో మ్యాచ్ ను ముగించి టీమిండియా శిబిరంలో ఆనందోత్సాహాలు నింపాడు.

భారత బౌలర్ల మాదిరే పాక్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో మనోళ్లు పరుగులు చేయడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అయితే జడేజా, పాండ్యలు రాణించడంతో భారత్ గెలుపొందింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్ 3 వికెట్లు, నసీమ్ షా 2 వికెట్లు తీశారు.

Team India

భారత్, పాక్ మ్యాచ్ అంటే అభిమానులు ఏమేం ఉండాలని కోరుకుంటారో అన్నీ లభించిన మ్యాచ్ ఇది అని చెప్పొచ్చు. నరాలు తెగే ఉత్కంఠ, వినోదం, క్రికెటింగ్ నైపుణ్యాలు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభ, చివరి ఓవర్ వరకు కొదమసింహాల్లా తలపడిన ఆటగాళ్ల పోరాట పటిమతో దాయాదుల సమరం మరోసారి తన ప్రత్యేకతను చాటింది. భారత్, పాక్ మధ్య పోరుని ఎందుకు హైఓల్టేజ్ ఫైట్ అంటారో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆసియా కప్ లో భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 31న హాంకాంగ్ జట్టుతో ఆడనుంది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ నిర్ణయాన్ని బౌలర్లు వమ్ము కానివ్వలేదు. పాకిస్తాన్ పై చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ ను కోలుకోనివ్వలేదు. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యలు చెలరేగారు. పదునైన బంతులతో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా టీమిండియా ప్రధాన పేసర్ భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచాడు. హార్దిక్ పాండ్య మూడు వికెట్లు పడగొట్టాడు. భువీ, పాండ్యలు పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టారు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

మ్యాచ్ విన్నర్ పాండ్య..

పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 43 పరుగులు) టాప్ స్కోరర్. సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ బాబర్ ఆజమ్(10) విఫలం అయ్యాడు. ఇఫ్తికార్ అహ్మద్ 28 పరుగులు సాధించాడు. ఫకార్ జమాన్ (10), కుష్దిల్ షా (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. చివర్లో దహాని (6 బంతుల్లో 16), హరీస్ రవూఫ్ (7 బంతుల్లో 13 నాటౌట్) ధాటిగా ఆడడంతో పాక్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ ని సాధించగలిగింది.

స్కోర్లు..
పాకిస్తాన్-19.5 ఓవర్లలో 147 ఆలౌట్
భారత్ -19.4 ఓవర్లలో 148/5