ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం

  • Published By: vamsi ,Published On : March 17, 2020 / 11:41 PM IST
ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ కాంట్రాక్టులు వదులు కోవాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భారత్‌లోనూ కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్ విస్తృతికి అడ్డకట్ట వేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. విదేశీ వీసాలను వచ్చే నెల 15 వరకు నిషేధించింది.

ఈ క్రమంలో ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించగా.. ఈ క్రమంలోనే కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు ఒప్పందాలను రద్దు చేసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఆసీస్ క్రికెట్ బోర్డు ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు. ఐపీఎల్‌లో ఆడాలా? వద్దా? అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ వెల్లడించారు.

ఆస్ట్రేలియాకు చెందిన మొత్తం 17 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో పేసర్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తదితరులు ఐపీఎల్‌తో ఒప్పందాన్ని వదులకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐపీఎల్ వేలంలో 3.2 మిలియన్ డాలర్లు (రూ.15.2 కోట్లు) పలికిన కమిన్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా ఉన్నాడు.