రోహిత్‌కు లక్మణ్ సలహా: నేను చేసిన తప్పు నువ్వూ చేయొద్దు

రోహిత్‌కు లక్మణ్ సలహా: నేను చేసిన తప్పు నువ్వూ చేయొద్దు

టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాను చేసిన తప్పు ప్రస్తుత ఓపెనర్ రోహిత్ శర్మను చేయొద్దని సూచించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఓపెనర్‌గా దిగి బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా దిగే అవకాశం కల్పించనుంది టీమిండియా మేనేజ్‌మెంట్. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకోవాలని తన అనుభవంతో విలువైన సలహాలు ఇచ్చాడు. 

దక్షిణాఫ్రికా జట్టుతో సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడే క్రమంలో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భాగంగా ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్ లెవన్ వర్సెస్ టీమిండియాలు విజయనగరం వేదికగా మూడో రోజైన సెప్టెంబరు 28న భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, మయాంక్ బరిలోకి దిగగా, రెండో ఓవర్లో రెండు బంతులు మాత్రమే ఆడి రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. 

ఒకప్పుడు టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన లక్ష్మణ్ సక్సెస్ కాలేకపోవడంతో మిడిలార్డర్‌కు మారిపోయాడు. అది దృష్టిలో ఉంచుకున్న లక్ష్మణ్ ప్రస్తుత ఓపెనర్‌కు విలువైన సలహాలు ఇస్తున్నాడు. కొందరి సూచనల మేరకు తాను ఓపెనర్‌గా దిగినప్పుడు టెక్నిక్‌తో పాటు మైండ్ సెట్ కూడా మార్చుకుని బరిలోకి దిగానని అందుకే సక్సెస్ కాలేకపోయానని తెలిపాడు. 

‘ఓ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎప్పుడూ ఫ్రంట్ ఫూట్ ట్రిగ్గర్ టెక్నిక్‌నే వాడిని. కోచ్‌లు, సీనియర్ల సలహా మేరకు లెంగ్త్ బాల్ నుంచి స్టీప్ బౌన్స్ కోసం ప్రయత్నించా. అది నా బ్యాటింగ్ పై ప్రభావం చూపించింది. సక్సెస్ కాలేకపోయా. నాకు తెలిసి రోహిత్ శర్మ ఈ తప్పు చేయడనుకుంటున్నా’ అని వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు. 

టీమిండియా తరపున మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడిన వీవీఎస్ లక్ష్మణ్.. 1996-98లో టీమిండియా మేనేజ్‌మెంట్ ఒత్తిడి మేరకు టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడాడు. కానీ.. విఫలమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ మిడిలార్డర్‌కి మారి 134 టెస్టుల్లో 8,781 పరుగులు చేశాడు.