ఒకే ఒక్కడు మనగాడు: యాషెస్‌ టెస్ట్‌లో ఇంగ్లాండ్ విజయం

  • Published By: vamsi ,Published On : August 25, 2019 / 04:04 PM IST
ఒకే ఒక్కడు మనగాడు: యాషెస్‌ టెస్ట్‌లో ఇంగ్లాండ్ విజయం

క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠ రేపిన 2019 ప్రపంచకప్ ఫైనల్ పోరులో 44 ఏళ్ల ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన బెన్‌స్టోక్స్ యాషెస్ సిరీస్‌లో కూడా ఇంగ్లాండ్ పరువు నిలిపారు. యాషెస్ సిరీస్‌లో ఓటమి అంచున ఉన్న ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు బెన్ స్టోక్స్. యాషెస్‌ మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ అద్భుత విజయం అందుకుంది. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఒక్క వికెట్ తేడాతో భారీ విజయం అందుకుంది.

బెన్‌స్టోక్స్‌(135*) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడడంతో ఇంగ్లాండ్ జట్టు అధ్భుతమైన విజయం అందుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లను కోల్పోయి 362 పరుగులు చేయండంతో ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. 156/3 స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌.. ఆరంభంలోనే నాలుగో వికెట్‌ రూట్‌(77) ను కోల్పోయింది. అనంతరం వచ్చిన బెయిర్‌ స్టో(36) కాసేపు ఆడినా.. బట్లర్‌(1), క్రిస్‌ వోక్స్‌(1) వెంటవెంటనే పెవీలియన్‌కు వెళ్లిపోయారు.

ఈ క్రమంలో బరిలోకి దిగిన స్టోక్స్‌ ఒక్కడే నిలబడి ఆర్చర్‌(15) సాయంతో పరుగులు రాబట్టాడు. అయితే ఆర్చర్‌ ఔట్‌ కావడంతో ఇన్నింగ్స్‌ ముగియడానికి ఇంకా ఎంతోసేపు పట్టదేమో అనిపించింది. ఒక ఎండ్‌లో జాక్‌ లీచ్‌(1*) సాయంతో స్టోక్స్‌ పట్టుదలగా బ్యాటింగ్‌ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 4, లియోన్‌ 2, కమిన్స్‌, పాటిన్సన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. 

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 179 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 67 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 246 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌కు 359 పరుగుల లక్ష్యం ఇవ్వగా 362 పరుగులు చేసింది ఇంగ్లీష్ జట్టు. 11 ఫోర్లు, 8 సిక్సర్లతో భారీ స్కోరు చేసిన స్టోక్స్ ప్రపంచకప్ తర్వాత బెన్ స్టోక్స్ మరోసారి ఆ జట్టుకు ఘన విజయం అందించారు. చివరి వికెట్‌కు 76పరుగుల భాగస్వామ్యం అందించాడు.