Christian Atsu: తుర్కియే భూకంపం.. బతికే ఉన్నాడనుకున్నారు.. కానీ శవం దొరికింది..

Christian Atsu Died: ఫుట్​బాల్ క్రీడాభిమానులకు దుర్వార్త. తుర్కియే భూకంపంలో ఘనా జాతీయ ఆటగాడు, మాజీ న్యూకాజిల్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ అట్సు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారణ అయింది.

Christian Atsu: తుర్కియే భూకంపం.. బతికే ఉన్నాడనుకున్నారు.. కానీ శవం దొరికింది..

Christian Atsu Died: ఫుట్​బాల్ క్రీడాభిమానులకు దుర్వార్త. తుర్కియే భూకంపంలో ఘనా జాతీయ ఆటగాడు, మాజీ న్యూకాజిల్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ అట్సు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారణ అయింది. తుర్కియేలో అతడు ఉంటున్న నివాస శిథిలాల క్రింద క్రిస్టియన్ మృతదేహాన్ని కనుగొన్నట్టు స్థానిక మీడియా శనివారం వెల్లడించింది. శిథిలాల కింద క్రిస్టియన్ సజీవంగా ఉన్నట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి.

తుర్కియే దక్షిణ ప్రావిన్స్ హటేలో శిథిలాల కింద క్రిస్టియన్ అట్సు మృతదేహాన్ని కనుగొన్నారని అతడి మేనేజర్ మురత్ ఉజున్‌మెహ్మెట్ శనివారం DHA వార్తా సంస్థతో చెప్పారు. “శిథిలాల కింద అట్సు నిర్జీవదేహాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన మరిన్ని వస్తువులను బయటకు తీస్తున్నారు. అట్సు ఫోన్ కూడా దొరికింద”ని ఉజున్‌మెహ్మెట్ విలేకరులతో అన్నారు.

క్రిస్టియన్ అట్సు మరణవార్తను అతడి ఏజెంట్ నానా సెచెరే ట్విటర్ ద్వారా వెల్లడించారు. “క్రిస్టియన్ అట్సు మృతదేహాన్ని ఈ రోజు ఉదయం వెలికితీసినట్లు అతడి శ్రేయోభిలాషులందరికీ బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను. క్రిస్టియన్ అట్సు కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అతడు క్షేమంగా రావాలని ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కష్ట సమయంలో క్రిస్టియన్ అట్సు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టవద్దని, వారి ప్రైవసీని కాపాడాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాన”ని నానా సెచెరే ట్వీట్ చేశారు.

Also Read: టర్కీ, సిరియాలో 40,000 దాటిన మరణాలు..వారం దాటినా శిథిలాల కింద వినిపిస్తున్న సజీవ స్వరాలు

క్రిస్టియన్ అట్సు మరణ వార్త తెలియగానే అతడి సహచర ఆటగాళ్లు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. క్రీడాభిమానులు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. తుర్కియే, సిరియా దేశాలను అతలాకుతలం చేసిన తీవ్ర భూకంపం దాదాపు 40 వేల మందిని బలి తీసుకుంది. లక్షలాది మంది సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అక్కడక్కడ శిథిలాల కింద సజీవంగా ఉన్న వారిని సహాయక సిబ్బంది కాపాడుతున్నారు.