ఆసీస్‌కు చుక్కలు చూపిస్తా: బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విజయ్‌శంకర్

ఆసీస్‌కు చుక్కలు చూపిస్తా: బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విజయ్‌శంకర్

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లకు టీ20, వన్డేల సిరీస్‌లకు  ఎంపికైన తమిళనాడు ఆల్-రౌండర్ విజయ్ శంకర్ ఆసీస్ జట్టుపై తన సత్తా చూపిస్తానంటున్నాడు. సొంతగడ్డపై ఫిబ్రవరి 24నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌లో భారత్.. ఆసీస్‌తో తలపడనుంది. ఈ మేర బీసీసీఐ ఇప్పటికే 15మందితో కూడిన జట్లను ప్రకటించింది. అందులో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ విజయ్ శంకర్.. ఆసీస్‌పై బౌలింగ్‌తో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 

ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో బౌలింగ్‌తో రాణించేందుకు అవకాశమే దక్కకపోవడంతో ఈసారి అందుకోసం ప్రయత్నిస్తానంటున్నాడు. మరి కొద్ది రోజుల్లో ప్రపంచ కప్ మొదలుకానుండగా బౌలింగ్‌లో మెలకువలు నేర్చుకుని వరల్డ్ కప్ జట్టుకు సిద్ధమవ్వాలని శంకర్ ప్లాన్.

‘నిదహాస్ ట్రోఫీలో ఆడినప్పుడు కేవలం వికెట్లు తీయడానికే ప్రయత్నించేవాడిని. ఇప్పుడు నా మానసిక స్థాయి మెరుగుపడింది. మంచి ప్రదేశాల్లో బంతులు వేసి బ్యాట్స్‌మెన్‌ను గందరగోళంలో పడేయాలని చూస్తున్నా. ఈ ఆస్ట్రేలియాతో సిరీస్ నేనేమిటో చూపించడానికి మంచి అవకాశంగా భావిస్తున్నా’ అని తెలిపాడు.

ఇటీవల విజయ్ శంకర్ ప్రదర్శనపై మాట్లాడిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. ఆస్ట్రేలియా సిరీస్‌లో బాగా రాణిస్తాడనే నమ్మకముంది. అతని ఆటలో మునుపటి కంటే నాణ్యత కనిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న మ్యాచ్‌లలో చూద్దాం అతని ప్రదర్శన ఎలా ఉండబోతుందో’నని వ్యాఖ్యానించాడు.