IndVsAus 1st T20I : తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. భారీ స్కోర్ చేసినా భారత్ కు విజయం మాత్రం దక్కలేదు.

IndVsAus 1st T20I : తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

IndVsAus 1st T20I : మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారీ స్కోర్ చేసినా భారత్ కు విజయం మాత్రం దక్కలేదు. కొండంత లక్ష్యం ఆసీస్ బ్యాటర్ల విజృంభణతో కరిగిపోయింది. ఆసీస్ బ్యాటర్ల దూకుడు ముందు అంతటి భారీ లక్ష్యం సైతం చిన్నబోయింది.

లక్ష్య చేధనలో ఆసీస్ బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. దీంతో భారత్ నిర్దేశించిన 209 పరుగుల భారీ టార్గెట్ ను 19.2 ఓవర్లలోనే ఆసీస్ చేధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానిక 208 పరుగుల భారీ స్కోరు సాధించగా.. ఆసీస్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

ఆసీస్ బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 30 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 8 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత మ్యాథ్యూ వేడ్ (21 బంతుల్లో 45*), స్టీవెత్ స్మిత్ (24 బంతుల్లో 35 పరుగులు) రాణించారు. దీంతో తొలి టీ20లో టీమిండియాను చిత్తు చేసింది ఆస్ట్రేలియా. ఆసీస్ లక్ష్యఛేదన ధాటిగా ఆరంభమైంది. ముఖ్యంగా ఓపెనర్ గా వచ్చిన ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చాహల్ ఒక వికెట్ తీశాడు. భారత ఫీల్డర్లు మూడు క్యాచ్ లు విడిచిపెట్టడం.. హర్షల్ పటేల్, భువనేశ్వర్ ఇద్దరూ కలిపి 8 ఓవర్లలో 101 రన్స్ ఇవ్వడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు.

మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ మొహాలీలో జరిగింది. టాస్ నెగ్గిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసక బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాకు చుక్కలు కనిపించాయి. మిడిలార్డర్ లో వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపుదాడి చేశాడు. పాండ్యా కేవలం 30 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.

పాండ్యా సంచలన ఇన్నింగ్స్ సాయంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 55 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 46 పరుగులు) చేశారు. కెప్టెన్ రోహిత్ 11, కోహ్లీ 2, దినేశ్ కార్తీక్ 6, అక్షర్ పటేల్ 6 పరుగులు చేసి అవుటయ్యారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు పడగొట్టాడు. హేజెల్ వుడ్ 2 వికెట్లు, కామెరాన్ గ్రీన్ 1 వికెట్ తీశారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 23న నాగపూర్ లో జరగనుంది.