IPL 2020 : వాట్సన్‌ మెరిసినా చెన్నై పరాజయం, కోల్ కతా అనూహ్య విజయం

  • Published By: madhu ,Published On : October 8, 2020 / 06:25 AM IST
IPL 2020 : వాట్సన్‌ మెరిసినా చెన్నై పరాజయం, కోల్ కతా అనూహ్య విజయం

IPL 2020, KKR vs CSK : ఐపీఎల్‌లో చెన్నై మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా జట్టు అనూహ్య విజయం సాధించింది. కోల్‌కతా బౌలర్లు అద్భత బౌలింగ్‌తో చెన్నై బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశారు. చెన్నై జట్టులో ఓపెనర్ వాట్సన్ అర్థ సెంచరీతో రాణించినప్పటికీ.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.



తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా రాహుల్ త్రిపాఠి సూపర్ ఓపెనింగ్‌తో తొలి 10 ఓవర్లలో అద్భుతంగా 90 పైచిలుకు పరుగుల సాధించి పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే బ్రావో అద్భుత బౌలింగ్‌తో త్రిపాఠిని అవుట్ చేయడంతో కోల్‌కతా స్కోరు బోర్డు వేగం మందగించింది. మిగతా బ్యాట్స్‌‌మెన్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులకు కోల్‌కతా ఆలౌట్‌ అయింది. చెన్నై బౌలర్లలో బ్రావో 3 వికెట్లు పడగొట్టగా.. శామ్ కర్రన్, శార్దూల్ ఠాకూర్, కరణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.



తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. డూప్లెసిస్ వెంటనే అవుట్ అయ్యడు. అయితే మరో ఓపెనర్ షేన్ వాట్సన్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు వైపు నడిపించాడు. వాట్సన్‌కు అంబటి రాయుడు చక్కటి సహకారం అందించాడు. దీంతో 12 ఓవర్లకు 99 రన్స్‌తో చెన్నై పటిష్ఠ స్థితిలో నిలిచింది. కానీ 13వ ఓవర్లో నాగర్‌కోటి బౌలింగ్‌లో రాయుడు అవుటవడంతో టెన్షన్ మొదలైంది. ఆ తరువాతి ఓవర్లోనే వాట్సన్‌ను నరైన్ అద్భుతమైన డెలివరీతో LBWగా వెనక్కి పంపాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది.



ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు దిగినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత వచ్చిన జాధవ్ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడడంతో పాటు బంతులు వృధా చేయడంతో కోల్‌కతా విజయం ఖరారైంది. చివరి ఓవర్లో జడేజా రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో కోల్‌కతా టోర్నీలో 5 మ్యాచ్‌లలో 3వ విజయాన్ని నమోదు చేసింది. ఇక 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. కోల్‌కతా బౌలర్లలో కమ్మిన్స్ మినహా మిగిలిన బౌలర్లందరూ తలో వికెట్ పడగొట్టారు.