Asia Cup 2022 : భారత్ ఫైనల్ ఆశలు ఆవిరి.. అప్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ

ఆసియా కప్‌లో భారత్‌ ఫైనల్‌ అవకాశాలకు పాకిస్తాన్ గండికొట్టింది. అఫ్ఘానిస్తాన్ తో ఉత్కంఠ పోరులో పాక్‌ జట్టు ఒక వికెట్‌ తేడాతో గెలుపొందింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 9 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌లో ఛేదించింది.

Asia Cup 2022 : భారత్ ఫైనల్ ఆశలు ఆవిరి.. అప్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ

Asia Cup 2022 : భారత క్రికెట్ లవర్స్ కు ఇది బ్యాడ్ న్యూస్. ఏదైతే జరక్కూడదని దేవుడిని ప్రార్థించారో అదే జరిగిపోయింది. ఆసియా కప్‌లో భారత్‌ ఫైనల్‌ అవకాశాలకు పాకిస్తాన్ గండికొట్టింది. అఫ్ఘానిస్తాన్ తో ఉత్కంఠ పోరులో పాక్‌ జట్టు ఒక వికెట్‌ తేడాతో గెలుపొందింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 9 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌లో ఛేదించింది.

భారత్ ఫైనల్ ఆశలు ఆవిరవడానికి ప్రధాన కారణం పాక్ చివరి వరుస బ్యాట్స్ మన్ నసీమ్ షా. పాక్ విజయానికి చివరి ఓవర్ లో 11 పరుగులు అవసరం కాగా, నసీమ్ షా (4 బంతుల్లో 14 నాటౌట్) వరుసగా రెండు సిక్సర్లు బాది పాక్ ను విజయతీరాలకు చేర్చాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులే చేసింది. ఆ జట్టులో ఇబ్రహీం జద్రాన్‌(35) టాప్‌ స్కోరర్‌. మిగతావారు విఫలం కావడంతో లో స్కోర్‌కే పరిమితమైంది. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రవూఫ్‌ 2 వికెట్లు తీశాడు. నసీమ్‌ షా, మహమ్మద్‌ హస్నేన్‌, నవాజ్‌, షాదాబ్‌ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.2 ఓవర్లలో ఛేదించింది. చివరి ఓవర్‌లో పాక్‌ విజయానికి 11 పరుగులు అవసరం కాగా చేతిలో ఒకే వికెట్‌ ఉంది. అయితే ఒత్తిడిని తట్టుకొని పాక్‌ బ్యాటర్‌ నసీమ్‌ షా వరుస రెండు బంతులను సిక్సర్లుగా మలిచి ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్ బ్యాటర్లలో షాదాబ్‌ ఖాన్‌(36), ఇఫ్తీకర్‌ అహ్మద్‌(30) రాణించారు. అప్ఘాన్ బౌలర్లలో ఫరూకీ, అహ్మద్‌ మాలిక్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీశాడు.

ఈ విజయంతో పాక్‌ జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటికే శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంది. దీంతో గురువారం భారత్‌, అప్ఘాన్‌ మధ్య సెప్టెంబర్ 8న జరగాల్సిన మ్యాచ్‌ నామమాత్రం కానుంది. పాకిస్తాన్ మ్యాచ్‌లో అప్ఘాన్ జట్టు గెలుపొంది ఉంటే భారత్‌కు ఫైనల్‌ అవకాశాలు ఉండేవి. ఈ నెల 11న ఫైనల్ జరగనుంది.