Suryakumar Yadav: సూర్యకుమార్ కాదు.. శూన్యకుమార్.. 6 ఇన్నింగ్స్‌ల్లో నాలుగో గోల్డెన్ డకౌట్
సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌లో సూర్య ఇలా గోల్డెన్ డకౌట్ కావడం ఇది నాలుగో సారి

Suryakumar Yadav
Suryakumar Yadav:సూర్యకుమార్ యాదవ్.. పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐపీఎల్(IPL)లో పరుగుల వరద పారించి అంతర్జాతీయ క్రికెట్‌లో లేటుగా ఏంట్రీ ఇచ్చినా తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా టీ20ల్లో మైదానం నలువైపులా షాట్లు కొడుతూ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అభిమానులు అతడిని ముద్దుగా ‘మిస్టర్ 360’ అని పిలుచుకుంటారు. వన్డేలు, టెస్టుల్లో అతడి ఆట ఎలాగున్నప్పటికి టీ20ల్లో మాత్రం నెంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు.
అయితే.. ఇటీవల అతడు పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. గత ఆరు ఇన్నింగ్స్‌లో సూర్యకు ఇది నాలుగో గోల్డెన్ డక్ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
IPL 2023, DC Vs MI: బోణీ కొట్టిన ముంబై.. ఉత్కంఠపోరులో ఢిల్లీపై గెలుపు
ఐపీఎల్ కంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డక్‌గా ఔట్ అయ్యాడు. అయితే.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో 15, రెండో మ్యాచ్‌లో 1 పరుగు చేశాడు. మూడో మ్యాచ్‌లో మళ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో అభిమానులు సూర్యకుమార్‌పై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. “టెస్టులో విఫలం, వన్డేల్లో గోల్డెన్ డక్‌లు, ఇప్పుడు ఇక టీ20ల్లో కూడానా.. “‘ఇక ఇంతేనా, నువ్వ మారవా ‘అంటూ కొందరు కామెంట్లు చేయగా, ‘శూన్యకుమార్’ గా, ‘సున్నాకుమార్’ అంటూ మరికొందరు సంబోధిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ పటేల్(54; 25 బంతుల్లో 4ఫోర్లు, 5 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(51; 47 బంతుల్లో 6ఫోర్లు) అర్థశతకాలతో రాణించారు. అనంతరం లక్ష్యాన్నిసరిగ్గా ఆఖరి బంతికి ఛేదించింది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ (65; 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకం బాదగా తిలక్ వర్మ (41; 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్(31)లతో పాటు ఆఖర్లో టిమ్ డేవిడ్(13 నాటౌట్), కామెరూన్ గ్రీన్(17 నాటౌట్) రాణించడంతో విజయం సాధించింది.