T20 World Cup 2021: టీమిండియా మరీ ఇంత చెత్త ప్రదర్శన.. ఓటమి కాదిది ఘోర పరాభవం

గేమ్‌లో గెలుపోటములు సహజం.. కానీ, ఇంత దారుణంగా ఓడిపోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనూహ్య రీతిలో ఓడిపోవడం భారత జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది.

T20 World Cup 2021: టీమిండియా మరీ ఇంత చెత్త ప్రదర్శన.. ఓటమి కాదిది ఘోర పరాభవం

Teami India

T20 World Cup 2021: గేమ్‌లో గెలుపోటములు సహజం.. కానీ, ఇంత దారుణంగా ఓడిపోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనూహ్య రీతిలో ఓడిపోవడం భారత జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది. ప్రత్యర్థి జట్టు ఓపెనర్లను సైతం అవుట్ చేయలేని బౌలర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరల్డ్ నెం.1 బౌలింగ్ టీం:
అంతర్జాతీయ క్రికెట్ లో నెం.1 బౌలింగ్ టీంగా గుర్తింపు తెచ్చుకున్న టీమిండియా బౌలర్లు పాకిస్తాన్ ఓపెనర్లను సైతం అవుట్ చేయలేకపోవడం గమనార్హం. భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా పరుగులు సమర్పించడం వరకే సరిపెట్టుకున్నారు. ఫాస్టెస్ట్ బౌలర్ గా టాప్ 10లో పేరున్న బుమ్రాకు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం గమనార్హం.

మమ్మల్ని మించినోళ్లు లేరన్నారు:
సక్సెస్ అయిన ప్రతి మ్యాచ్ లోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని అప్పజెప్తే.. అంతవరకూ చేరుకోకుండా బౌలర్లు అడ్డుకునేవారు. ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచే ఒడిదుడుకులు తప్పలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ తో మొదలైన పతనం.. చివరి వరకూ కొనసాగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మినహాయించి ఎవ్వరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు పట్టుమని 15పరుగులు కూడా చేయలేక చేతులెత్తేశారు.

బొక్కబోర్లాపడ్డ ఐపీఎల్ హీరోలు:
ఐపీఎల్ హీరోలుగా పేరు తెచ్చుకున్న ముంబై బ్యాట్స్‌మెన్ రోహిత్ కుమార్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. పంజాబ్ హీరో కేఎల్ రాహుల్. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బొక్కా బోర్లాపడ్డారు.

…………………………………………. : టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి సర్వం సిద్ధం..పాసులు ఉంటేనే అనుమతి

ఓటమి కాదు.. ఘోర పరాభవం.
ఇది కేవలం ఓటమి కాదు.. ఘోర పరాభవం. రాజకీయ పరిస్థితులను టీమిండియా క్రికెట్ పై రుద్దుతూ ఇన్నేళ్లుగా దాయాది జట్టును దూరం పెడుతూ వచ్చారు. చివరిసారిగా ఆడిన మ్యాచ్ లోనూ పాకిస్తాన్ పెద్దగా రాణించకపోవడంతో భారత్ ముందు తేలిపోతుందనుకున్నారు. అనూహ్యంగా టాస్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన పాక్.. చేజింగ్ లో ఏ మాత్రం తడబడకుండా ఓపెనర్లతోనే మ్యాచ్ ముగించి షాక్ ఇచ్చింది. హోరాహోరీ పోరు ఏ క్షణంలోనూ కనిపించలేదు.

పాక్ విజయం..
పాకిస్తాన్ క్రికెట్ అంటే ఇతర జట్లు అంతగా ఆసక్తి చూపించవు. సెక్యూరిటీ అంశాలు, వాతావరణ పరిస్థితులు లాంటి సాకులు చెప్తూ తప్పుకుంటాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఒక్క రోజు ముందు జరగాల్సిన న్యూజిలాండ్ తో మ్యాచ్ సైతం రద్దు అయింది. ఇంగ్లాండ్ అదే పరిస్థితి.

అపవాదులు కొత్త కాదు:
పాక్ క్రికెట్ కు అపవాదులు కొత్త కాదు. సీనియర్ క్రికెటర్ల నుంచి ఆనవాయితీగా వస్తూనే ఉంది. వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్ లు రద్దు కావడం, వరల్డ్ కప్ టోర్నీల్లో ఒక్కసారి కూడా ఇండియాతో గెలవకపోవడం లాంటి అపవాదులన్నింటికీ గట్టిగా జవాబు చెప్పింది. విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ కూల్ గా లాగించేశారు.

పోరాట పటిమను చూపించారు. ప్రత్యర్థిని చిత్తు చేశారు. ఒక భారతీయుడిగా టీమిండియా గెలవాలని చివరి ఓవర్ వరకూ ఎదురుచూసిన ప్రతి ఒక్కరికీ నిరాశ తప్పలేదు. పదకొండు మంది ఆడిన ఆట పరాభవాన్ని కోట్ల మంది నెత్తిన మోస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ కోసమే మెంటార్ గా వచ్చిన ధోనీ మార్పులతో తర్వాతి మ్యాచ్ లోనైనా జట్టు మేల్కొంటుందని ఆశిద్దాం.