అక్కడ మన బౌలర్లు రాణించగలరు: భజ్జీ

అక్కడ మన బౌలర్లు రాణించగలరు: భజ్జీ

వరల్డ్ కప్ ముంగిట ఇంగ్లాండ్ గడ్డపై బౌలర్లు సత్తా చాటుతారని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ‘మనం క్రికెట్ మొదలుపెట్టినప్పటి సమయం, ఇప్పుడు ఒక్కటిగా లేదు. ఇప్పుడంతా పరుగులతో ముడిపడి ఉంది. ప్రేక్షకులు భారీ స్కోరునే టార్గెట్ చేశారు. బౌలర్ల పని మాత్రం సులువేం కాదు’ 

‘ద ఓవల్, రోజ్ బౌల్ వంటి స్టేడియాల్లో స్పిన్నర్లకు అనుకూలించదు అంటే నేనొప్పుకోను. నేను సర్రే క్రికెట్ ఆడాను. అక్కడి స్పిన్నర్లు రాణించగలరన్న సంగతి నాకు తెలుసు. రవీంద్ర జడేజాకు అవకాశమిస్తే మంచి ఎఫెక్టివ్‌గా మారే సూచనలు ఉన్నాయి. ప్రతి జట్టు మంచి బ్యాట్స్ మెన్ కలిగి ఉంది. కానీ, ప్రతి ఒక్కరూ బుమ్రా కాలేరు. టోర్నీలో బుమ్రా ప్రదర్శన బాగుంటుందని ఆశిస్తున్నా’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. 

భారత మాజీ ఓపెనర్ ఎస్.రమేశ్ మాట్లాడుతూ.. ‘1999లో బర్మింగ్‌హామ్ వేదికగా మే29న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ నాకింకా గుర్తుంది. భారీగా వర్షం, కొంచెం వణుకు ఉన్నాయి. రెండు రోజుల పాటు వాతావరణం అనుకూలించలేదు. అది బ్యాట్స్‌మెన్‌కు తలనొప్పిగా మారింది’ అని గుర్తు చేసుకున్నాడు. 

భారత బౌలర్లపై గట్టి నమ్మకమే కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితమే ముంబై ఇండియన్స్ తరపున ఆడిన మ్యాచ్‌లో బుమ్రా సత్తా చాటడంతో దిగ్గజాలందరూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ అయితే ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అని ఆకాశానికెత్తేశాడు.