2021లో Reliance 5g సేవలు

  • Published By: madhu ,Published On : December 9, 2020 / 08:59 AM IST
2021లో Reliance 5g సేవలు

5G revolution in India : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భారత్‌ ప్రజలకు గుడ్ న్యూస్‌ చెప్పారు. 2021 ద్వితీయార్ధంలో 5జీ సేవలను జియో అందించడం మొదలుపెడుతుందని ప్రకటించారు. అత్యుత్తమ డిజిటల్‌ కనెక్టివిటీ ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని అభివర్ణించారు. ఈ ఆధిపత్యం కొనసాగించడానికి అవసరమైన 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా ప్రారంభించేందుకు విధానపరమైన నిర్ణయాలు భారత్‌ త్వరగా తీసుకోవాలన్నారు. 5జీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభమైంది. ఐఎంసీలో భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్న అన్ని ప్రధాన టెక్నాలజీ, ఐటీ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఐఎంసీ 2020ను టెలికమ్యూనికేషన్ విభాగం, సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) నిర్వహిస్తున్నాయి. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కు 30కి పైగా దేశాల నుంచి 210 మంది జాతీయ, అంతర్జాతీయ స్పీకర్లు, 3 వేలకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.



రిలయన్స్‌ తీసుకొచ్చే 5జీ నెట్‌వర్క్‌ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిందని అంబానీ తెలిపారు. వీటి హార్డ్‌వేర్‌, టెక్నాలజీ మొత్తం దేశంలోనే సిద్ధం కానున్నాయన్నారు. మోదీ‌ ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతీకగా జియో 5జీ ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికీ 2జీ వినియోగిస్తూ చాలా సేవలకు దూరంగా ఉన్నవారిని స్మార్ట్‌ఫోన్లు వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అంబానీ కోరారు. స్వదేశీ పరిజ్ఞానంతో సెమీకండక్టర్‌ పరిశ్రమకు భారత్‌ కేంద్రంగా మారుతుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు.



వచ్చే ఏడాది ప్రథమార్థంలో తక్కువ ధరలో జియో 4జీ మొబైల్‌ కూడా రానుంది. సెప్టెంబరు నెలలో జియో నెట్‌వర్క్‌లో కొత్తగా 15 లక్షల మంది వినియోగదారులు చేరగా, ఎయిర్‌టెల్‌లో 36 లక్షల మంది చేరారు. ఈ నేపథ్యంలో జియో కొత్త ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగానే తక్కువ ధరలో జియో 4జీ ఫోన్‌ను తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఐదు వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే ఈ మొబైల్‌ అందుబాటులోకి తెస్తారనే వార్తలు వస్తున్నాయి.