Telangana Congress : కాంగ్రెస్ లో పెరుగుతున్న అసంతృప్తుల జాబితా.. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు వీరే..
రెండో జాబితాలో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన కొందరు నేతలకు నిరాశ ఎదురైంది. దీంతో వారిలో కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు అధిష్టానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Telangana Congress
Telangana Assembly Elections 2023 : తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తుల జాబితా పెరుగుతోంది. మొదటి జాబితాలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో కొందరు పార్టీని వీడగా.. మరికొందరు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 45 మందికి అవకాశం దక్కింది. అయితే, రెండో జాబితాలో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన కొందరు నేతలకు నిరాశ ఎదురైంది. దీంతో వారిలో కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు అధిష్టానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా బైంసాలో కాంగ్రెస్ నేత డాక్టర్ కిరణ్ అనుచరులతో భేటీ అయ్యారు. ముథోల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన కిరణ్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో ఉంటానని, అభిమానులు అధైర్య పడొద్దని ఆయన పిలుపునిచ్చారు. అదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పార్టీ అధిష్టానం పై అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాకపోవటంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఆయన బోథ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ, వెన్నెల అశోక్ కు పార్టీ టికెట్ కేటాయించింది.
సెకండ్ లిస్ట్ లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు సంఖ్య చాలానే ఉంది..
– జడ్చర్ల, నారాయణ పేట్ నియోజకవర్గాల్లో ఎర్ర శేఖర్ టికెట్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం జడ్చర్ల అనిరుధ్ రెడ్డి, నారాయణపేట పరిణికా రెడ్డిలకు టికెట్ కేటాయించింది. దీంతో ఎర్ర శేఖర్ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.
– వనపర్తి నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి టికెట్ ఆశించారు. కానీ, మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికే పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది.
– ఎల్లారెడ్డి నియోజకవర్గం టికెట్ ను సుభాష్ రెడ్డి ఆశించగా.. మదన్ మోహన్ రావుకు దక్కింది.
– నర్సాపూర్ టిక్కెట్ ఆశించిన గాలి అనీల్ కు చుక్కెదురైంది. ఆ నియోజకవర్గం నుంచి అధిష్టానం ఆవుల రాజిరెడ్డికి టికెట్ కేటాయించింది.
– హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బల్మూరి వెంకట్ టికెట్ ఆశించారు. వడితల ప్రణవ్ కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది.
– హుస్నాబాద్ నియోజకవర్గం టిక్కెట్ ను ప్రవీణ్ రెడ్డి ఆశించారు. పొన్నం ప్రభాకర్ కు అధిష్టానం టికెట్ కేటాయించింది.
– మహబూబాబాద్ టిక్కెట్ ఆశించిన బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ లకు టికెట్ దక్కలేదు. ఇక్కడ మురళీ నాయక్ కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది.
– పాలకుర్తి నియోజకవర్గం నుంచి తిరుపతిరెడ్డి కూడా టికెట్ ఆశించారు. ఇక్కడ యశస్వినికి అధిష్టానం అవకాశం కల్పించింది.
– జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విష్ణువర్దన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగేందుకు అవకాశం దక్కుతుందని ఆశించారు. కానీ, ఈ నియోజకవర్గం నుంచి అజహరుద్దీన్ ను అధిష్టానం బరిలోకి దింపింది.
– అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించిన నూతి శ్రీకాంత్, మోతె రోహిత్ కు చెక్కెదురైంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధిష్టానం రోహిన్ రెడ్డికి అవకాశం కల్పించింది.
– మహేశ్వరం టిక్కెట్ ఆశించిన పారిజాత నర్సింహారెడ్డి నిరాశే ఎదురైంది. ఈ నియోజకవర్గం నుంచి కె. లక్ష్మారెడ్డికి అధిష్టానం అవకాశం కల్పించింది.
– దేవరకొండ నియోజకవర్గం టికెట్ ఆశించిన వడ్త్యా రమేష్ నాయక్ కు నిరాశే ఎదురైంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్అధిష్టానం మధుసూదన్ రెడ్డికి అవకాశం కల్పించింది.