మీరు కాల్‌మనీ యాప్‌ నుంచి లోన్‌ తీసుకుంటున్నారా? మీ బ్యాంక్‌ అకౌంట్‌ను లింక్‌ చేస్తున్నారా?

మీరు కాల్‌మనీ యాప్‌ నుంచి లోన్‌ తీసుకుంటున్నారా? మీ బ్యాంక్‌ అకౌంట్‌ను లింక్‌ చేస్తున్నారా?

Banks robbing the common man along with call money apps : మీరు కాల్‌మనీ యాప్‌ నుంచి లోన్‌ తీసుకుంటున్నారా? ఇందుకోసం మీ బ్యాంక్‌ అకౌంట్‌ను లింక్‌ చేస్తున్నారా? అయితే కచ్చితంగా కొరివితో తల గోక్కున్నట్లే! ఎందుకంటే.. కాల్‌మనీ యాప్‌ల పాపాలకు బ్యాంకులు అండగా నిలబడుతున్నాయి. అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేసే ఎన్‌బీఎఫ్‌సీలకు అండగా నిలబడి… మిమ్మల్ని నిలువునా దోచేస్తున్నాయి. మీ అకౌంట్‌లో పడే మొత్తం జీతాన్ని లోన్‌ యాప్‌లకు ట్రాన్స్‌ఫర్‌ చేసి… మిమ్మల్ని రోడ్డున పడేసేందుకు కూడా చాలా బ్యాంకులు రెడీగా ఉన్నాయి.

లోన్ల పేరుతో సామాన్యులకు వల వేసి… వారి ప్రాణాల్ని మింగేస్తున్న కాల్‌మనీ యాప్‌ల పాపంలో బ్యాంకుల పాత్రపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కాల్‌మనీ యాప్‌లు అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేసేందుకు సహకరిస్తున్న బ్యాంకులు… అన్యాయంగా సామాన్యుల ప్రాణాల్ని బలి తీసుకుంటూ పాపాన్ని మూటగట్టుకుంటున్నాయి. కాల్‌మనీ యాప్‌ల ద్వారా వ్యాపారం చేస్తూ జనం జీవితాలతో ఆడుకుంటున్న కొన్ని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు… బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీంతో సదరు బ్యాంక్‌లు… రుణం తీసుకున్న వారి శాలరీ ఎకౌంట్స్‌ నుంచి డబ్బును… కాల్‌మనీ యాప్‌ సంస్థలకు బదిలీ చేస్తున్నాయి.

ఈ విషయం తెలియని ఎంతోమంది చిరుద్యోగులు… లోన్‌ యాప్స్‌ నుంచి రుణాలు తీసుకుని బలవుతున్నారు. చాలామంది సామాన్యులు లోన్‌ తీసుకునేటప్పుడు ఎలాంటి నిబంధనలు ఒప్పుకుంటున్నారో కూడా తెలియనంతగా ట్రాప్‌లో చిక్కుకుంటున్నారు. బ్యాంక్‌ అకౌంట్‌లో పడిన జీతమంతా కాల్‌మనీ యాప్స్‌ దోచుకుంటుంటో ఏం చేయాలో తెలియక కన్నీరు పెట్టుకుంటున్నారు. కొంతమంది కుటుంబాల్ని సాదలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.

చాలామంది చిరుద్యోగులు కాల్‌మనీ యాప్‌ ద్వారా డబ్బు తీసుకుని… బ్యాంకుల వలలో చిక్కుకుంటున్నారు. ఓ ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌లోని తన శాలరీ అకౌంట్‌ నుంచి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ చిరుద్యోగి… ఈ విషయంపై సదరు బ్యాంకును సంప్రదించాడు. అయితే మాకే తెలియదంటూ బ్యాంకు సిబ్బంది చేతులు దులుపుకున్నారు. ఇదంతా రుణ ఒప్పందంలో భాగమంటూ ఏదో సమాధానం చెప్పి దాటేశారు. దీంతో నెల జీతాన్ని కాల్‌మనీ యాప్‌కు సమర్పించుకున్న సదరు చిరుద్యోగి… కుటుంబాన్ని ఎలా నడపాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.

అసలు ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదా? ఆర్‌బీఐ అనుమతి అవసరం లేకుండానే ఇలాంటి అక్రమ వ్యాపార సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం సరైన నియంత్రణా విధానమేనా? కాల్‌మనీ సంస్థలకు సహకరించి తమ బ్యాంకుల్లోని ఖాతాదారుల ఎకౌంట్స్‌ నుంచి డబ్బు బదిలీ చేయడం చట్టబద్ధమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు బ్యాంకులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

డిపాజిటర్లకు ఆరు నుంచి ఏడుశాతం మాత్రమే వడ్డీకి లోన్‌ ఇచ్చే బ్యాంకులు… ఇలా కాల్‌మనీ యాప్‌లకు సహకరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాల్‌మనీ యాప్‌లు 24 శాతం నుంచి 30శాతం వడ్డీ వసూలు చేసుకునేలా సహకరిస్తున్నాయని… ఈ వ్యవహారంపై ఇప్పటికైనా ఆర్‌బీఐ స్పందించాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ కాల్ మనీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మైక్రో ఫైనాన్స్ యాప్ లను రూపొందించిన యువకుడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రుణాలు ఇస్తున్న ఆన్‌లైన్ యాప్‌లు డబ్బులు కట్డడం ఆలస్యమైతే మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు తాళలేక బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మైక్రో ఫైనాన్స్ యాప్ లో తీసుకున్న లోన్‌కు 50 % పైన వడ్డీ చెల్లించినట్లు భాదితులు ఫిర్యాదుచేస్తున్నారు. ఆన్ లైన్ మనీ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా భావిస్తున్నారు. మనీ యాప్ లను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మనీ యాప్ లు నిషేధించాలని కేంద్ర హోం శాఖ, ఐటీ శాఖ లకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ రాసింది.