BJP September 17 Sentiment : సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం

హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

BJP September 17 Sentiment : సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం

BJP September 17 Sentiment : సెప్టెంబర్ 17 సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్న బీజేపీ ఇప్పుడు మరో ఎత్తుగడ వేసింది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కిషన్ రెడ్డి లేఖ రాశారు.

కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి రావాలంటూ కిషన్ రెడ్డి రాసిన లేఖపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

బీజేపీకి పోటీగా సెప్టెంబర్ 17న ఏం చేయాలన్న దానిపై టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారత దేశంలో విలీనమై 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో విమోచన వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 17న జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా 20 నిమిషాల పాటు ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన దినోత్సవానికి అమిత్ షా హాజరవుతారు. ఆయన సమక్షంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్డ్మ్ ఫోర్సెస్ తో పాటు ఎన్ సీసీ క్యాడెట్ల నుంచి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే కొత్త వివాదాలు తలెత్తే ప్రమాదం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర బలగాలు రాష్ట్రంలో పరేడ్ చేస్తే మరో రగడ రాజుకుంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

విమోచన దినోత్సవం పేరుతో సెంటిమెంట్ ను రగిలించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంటే.. టీఆర్ఎస్ కూడా సెప్టెంబర్ 17న భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బీజేపీ స్ట్రాటజీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వజ్రోత్సవాలు నిర్వహించాలని భావిస్తోంది. ఒకటి రెండు రోజులు కాకుండా సెప్టెంబర్ 17 నుంచి ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనుంది. ప్రభుత్వ పరంగా, టీఆర్ఎస్ పార్టీ పరంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది.