#Telanganabudget: ఏనుగు తొండమంత నిధులు చూపించి, ఎలుక తోకంత విడుదల చేస్తున్నారు: బీజేపీ నేతల విమర్శలు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఓ గిమ్మిక్కని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి అని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. ఏనుగు తొండమంత నిధులు చూపించి ఎలుక తోకంత నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు.

#Telanganabudget: ఏనుగు తొండమంత నిధులు చూపించి, ఎలుక తోకంత విడుదల చేస్తున్నారు: బీజేపీ నేతల విమర్శలు

#Telanganabudget: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఓ గిమ్మిక్కని కిషన్ రెడ్డి విమర్శించారు.

”బడ్జెట్ లో అన్నీ అబద్ధాలు.. అవాస్తవ లెక్కలు.. అమలుగాని వాగ్దానాలున్నాయి. ప్రకటనలు, ప్రచారానికి 575% పెంపుతో ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. పేదలకు భరోసాను ఇచ్చే ‘ఆరోగ్య శ్రీ’ పథకానికి తక్కువ నిధులు కేటాయించడం దారుణం. రాష్ట్ర బడ్జెట్ లో వాస్తవంగా ఖర్చుచేసేది చాలా తక్కువ. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్లకున్న చరిత్ర. ఈ ఏడాది కూడా ఇదే తంతు కొనసాగింది. ఇలాంటి గిమ్మిక్కులతో ఫలితం లేదని ప్రజలకు అర్థమైంది. తెలంగాణ బడ్జెట్‌ను చూసి ప్రజలు విసుగు చెందుతున్నారు” అని కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి అని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. ”అసెంబ్లీ సమావేశాలను కేవలం ప్రధాని మోదీని తిట్టడానికి, విమర్శించడానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏనుగు తొండమంత నిధులు చూపించి ఎలుక తోకంత నిధులు విడుదల చేస్తున్నారు. బడ్జెట్ అంకెలను భారీగా పెంచి ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తున్నారు.

సంక్షేమం, అభివృద్ధికి సరైన సమతుల్యత లేకుండా ప్రవేశపెడుతున్నారు. పాత సీసాలో కొత్త సార మాదిరిగా దళిత బంధుకు నిధులు కేటాయించారు. గత తొమ్మిది ఏళ్లుగా విద్యా వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. బడ్జెట్లో రైతుల ఆత్మహత్యల ఊసే లేదు. 2022లో తెలంగాణలో 1,000 మంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైతు స్వరాజ్ వేదిక గణాంకాలు చెబుతున్నాయి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు.. దేశవ్యాప్తంగా అబ్ కీ బార్ పరివార్ సర్కార్ రావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మీ కుటుంబం అన్నప్పుడు కేవలం మీ నలుగురే ఎందుకు మంత్రులవుతున్నారు?” అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

తెలంగాణ బడ్జెట్ పై బండి‌ సంజయ్ ఓ ప్రకటనలో స్పందించారు. హరీశ్ రావు ప్రవేశపెట్టిన‌ బడ్జెట్ డొల్లగా ఉందని విమర్శించారు. కేంద్రాన్ని తిట్టడం, కేసీఆర్ ను పొగడటం తప్ప బడ్జెట్ లో ఏమీ లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను వంచించేలా బడ్జెట్ ఉందని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఈ బడ్జెట్ లో నెరవేరుస్తారని ఆశించామని అన్నారు. ఆశగా ఎదురుచూస్తోన్న ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం మెండిచేయి చూపించిందని విమర్శించారు. బడ్జెట్ లో కేటాయింపులకు ఆచరణలో 50 శాతం నిధులు కూడా ఖర్చు కావటం లేదని అన్నారు.

”కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటటం లేదు. 52 శాతమున్న బీసీలకు బడ్జెట్ లో 2శాతం నిధులు
కేటాయించటం బాధాకరం. బీసీ విద్యార్థులకు ఈసారి కూడా పురుగుల అన్నమే దిక్కయ్యేలా ఉంది. విద్య, వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసేలా కేటాయింపులు ఉన్నాయి. కేంద్ర నిధులను డిజిటల్ సంతకాలతో కేసీఆర్ ప్రభుత్వం తస్కరిస్తోంది. పంచాయతీలకు నేరుగా నిధులిస్తామని చెప్పటం హాస్యాస్పదం” అని చెప్పారు.

ట్విట్టర్ లోనూ బండి సంజయ్ బడ్జెట్ పై స్పందించారు. గతంలో కేసీఆర్ అన్న మాటలను బండి సంజయ్ గుర్తు చేశారు. ”తెలంగాణ బడ్జెట్.. అంకెల గారడీ బడ్జెట్.. గందరగోళమైన బడ్జెట్.. ప్రజల స్పందన కరవైన బడ్జెట్.. ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే.. సరుకు లేదు, సంగతి లేదు! సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు! శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు! అంతా వట్టిదే.. డబ్బా! బభ్రాజమానం భజగోవిందం!!” అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.

Supreme Court Judges: సుప్రీం జడ్జీలుగా మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం.. 32కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య