BRS MLA Mynampally: హరీష్ వైపే అధిష్టానం.. మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధమైందా..? ఆ మూడు దారుల్లో మైనంపల్లి దారెటు

మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. తిరుపతి నుంచి బుధవారం హైదరాబాద్ చేరుకుంటారు.

BRS MLA Mynampally: హరీష్ వైపే అధిష్టానం.. మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధమైందా..? ఆ మూడు దారుల్లో మైనంపల్లి దారెటు

Mynampally Hanmanth Rao

Mynampally Hanumanth Rao: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తిరుపతిలో మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. పార్టీ నేతలు మైనంపల్లి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా మైనంపల్లి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తామంతా మంత్రి హరీష్‌రావు వెంటే ఉంటామని పార్టీ కీలక నేతలు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా? పార్టీ మార్పుపై కీలక ప్రకటన చేయబోతున్నారా? అనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. మైనంపల్లి అనుచరులు మాత్రం.. సీఎం కేసీఆర్ మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ కేటాయించినప్పటికీ పోటీచేసే విషయంపై మైనంపల్లి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. మొత్తానికి మైనంపల్లి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

Medak Constituency: యువనేత వ్యూహాలతో ఎమ్మెల్యే పద్మకు నిద్ర కరవు.. ఎవరా యంగ్ లీడర్?

వేటు తప్పదా?
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అతనిపై త్వరలో వేటు పడుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మైనంపల్లి హన్మంతరావు పేరును ప్రకటించారు. అయితే, మైనంపల్లి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారని విలేకరుల సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.. కేసీఆర్ ఘాటుగా స్పందిస్తూ.. టికెట్ ఇచ్చా పోటీ చేయడం చేయకపోవటం ఆయన ఇష్టం అంటూ నిర్ణయాన్ని మైనంపల్లికే వదిలేశారు. మైనంపల్లిపై ప్రస్తుతం అధిష్టానంతో పాటు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఒకవేళ మైనంపల్లి మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన పార్టీలోనూ, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంవస్తే అందులోనూ పెద్దగా ప్రాధాన్యత ఉండదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మైనంపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠతను రేపుతోంది.

Yuvagalam Padayatra: గన్నవరంలో వంశీకి చెక్‌పెట్టే దిశగా టీడీపీ అడుగులు.. భారీ బహిరంగ సభ.. లోకేశ్ స్పీచ్‌పై అందరిలోనూ ఆసక్తి

కీలక నిర్ణయం వెలువడేది అప్పుడేనా? 

మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. తిరుపతి నుంచి బుధవారం హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తరువాత తన అనుచరులతో మైనంపల్లి హన్మంతరావు సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో పార్టీలో కొనసాగాలా? మరో పార్టీ నుంచి బరిలోకి దిగుదామా? అనే విషయాలపై తన అనుచరుల అభిప్రాయాలు తీసుకుంటారని తెలుస్తోంది. తన తుది నిర్ణయాన్ని శుక్రవారం వరకు మైనంపల్లి వెల్లడించే అవకాశం ఉన్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.

మైనంపల్లి ముందు ఆ మూడు దారులు..

బీఆర్ఎస్ నుంచి తన తనయుడుకు మెదక్ టికెట్ ఇవ్వాలని మైనంపల్లి గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ, కేసీఆర్ అందుకు ఒప్పుకోకపోవటంతో.. తనయుడు కోసం  మైనంపల్లి పార్టీ మారుతారా? అనే అంశం ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ మైనంపల్లి పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ్తారు.. మల్కాజిగిరిలో మైనంపల్లికి, మెదక్ నియోజకవర్గంలో ఆయన తనయుడికి టికెట్ ఇచ్చేందుకు ఏ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇండిపెండెంట్లుగా మైనంపల్లి, ఆయన తనయుడు పోటీ చేస్తారా? బీఆర్ఎస్ పార్టీలో  మైనంపల్లి కొనసాగుతూ తన తనయుడిని మెదక్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపుతారా? ఈ మూడు దారుల్లో మైనంపల్లి ఏ దారిని ఎంచుకుంటారు అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతుంది.

నేను ఎవరి జోలికి వెళ్లను ..

తిరుమలలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం హరీష్ రావుపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఎవరి జోలికి వెళ్లను.. నా జోలికి వస్తే ఊరుకోను. నేను హార్డ్ వర్కర్‌ని, మా అబ్బాయి సేవా కార్యక్రమాలు చేశాడు. హైదరాబాద్ వెళ్లిన తరువాత మా అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అంటూ మైనంపల్లి హన్మంతరావు చెప్పారు.