CM KCR to go Yadadri: కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఇవీ ఆలయ అప్ డేట్స్…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను మరోసారి పరిశీలించనున్నారు.

CM KCR to go Yadadri: కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఇవీ ఆలయ అప్ డేట్స్…!

Kcr 1 1

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను మరోసారి పరిశీలించనున్నారు. ఇప్పటికే.. ముఖ్యమంత్రి హోదాలో 15 సార్లు.. ఈ క్షేత్రాన్ని కేసీఆర్ సందర్శించారు. ఈ సారి పనుల పురోగతిని తెలుసుకుని.. ఆలయ పున:ప్రారంభ తేదీని ఆయన ప్రకటించే అవకాశం ఉంది. అలాగే.. మహా సుదర్శన యాగం, ఇతర క్రతువుల వివరాలనూ కేసీఆర్ తెలియజేస్తారని సమాచారం.

ఇక.. యాదాద్రిలో 13 ఎకరాల గుట్టపై 104 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ప్రెసిడెన్షియల్ సూట్లు నిర్మించారు. ప్రారంభానికి 14 వీఐపీ విల్లాలు సిద్ధమయ్యాయి. ప్రధానాలయం సైతం పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధమైంది. ముఖ మండపం.. సకల హంగులతో చూడ ముచ్చటగా ఉంది. ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో విగ్రహాల బిగింపు ప్రక్రియ పూర్తయింది. అద్దాల మండపం.. ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంటోంది.

అలాగే.. ఆలయంలోని 3 అంతస్తుల్లో క్యూకాంప్లెక్స్ నిర్మాణ పనులు.. మాఢవీధుల్లో బంగారు వర్ణపు క్యూలైన్ల ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అంతకుముందు 500 గజాల్లో ఉన్న శివాలయాన్ని ఎకరం స్థలంలో విస్తరించారు. శివాలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామి మండపం, మరకత మండపం, రామాలయం, చుట్టూ ప్రాకారాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు.

శ్రీవారి కల్యాణ మండపాన్ని 500 మంది భక్తులు కూర్చుని.. వేడుక తిలకించేలా ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలను కనీసం 10 వేల మంది సౌకర్యంగా వీక్షించేలా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. టెంపుల్ సిటీ కోసం సేకరించిన 800 ఎకరాల్లో ఇప్పటికే 250 ఎకరాల స్థలాన్ని మొక్కల పెంపకం, గార్డెన్లు, ఫౌంటెయిన్లు, విశాలమైన రోడ్లకు వినియోగించారు. మరో 250 ఎకరాల్లో 580 డోనర్ కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గండి చెరువు సమీపంలో ఉన్న దీక్షాపరుల మండపం, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట నిర్మాణాలు పూర్తి చేశారు. చెన్నై, పుణె, హర్యానా, ఇండోర్, ముంబైకి చెందిన నిపుణుల ఆధ్వర్యంలో.. లడ్డూ ప్రసాదాల తయారీ యంత్రాల బిగింపు ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తంగా… 1200 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో మొదలైన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులకు.. ఇప్పటికే 850 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రధానమైన పనులను పూర్తి చేశారు. వీటన్నిటినీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తారు. ఉదయం 11.30 గంటలకు టెంపుల్ సిటీ హెలిపాడ్ కు సీఎం చేరుకుంటారు.