హైదరాబాద్ లో వరద బీభత్సం, 24 గంటల్లో 30 మంది మృతి

  • Published By: madhu ,Published On : October 15, 2020 / 12:05 PM IST
హైదరాబాద్ లో వరద బీభత్సం, 24 గంటల్లో 30 మంది మృతి

floods in hyderabad : హైదరాబాద్ లోల వరద బీభత్సం సృష్టించింది. ప్రాణ‌న‌ష్టం కూడా భారీ సంఖ్యలోనే ఉంది. 24 గంట‌ల్లో 30మందికి పైగా వ‌ర్షం మింగేసింది. పల్లె చెరువులో ఆరుగురి మృతదేహాలు గుర్తించ‌గా.. మరో 9 మంది గల్లంతయ్యారు.. ఎస్ఆర్ న‌గ‌ర‌లో ఇద్దరు మృతి చెంద‌గా.. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో మూడేళ్ల చిన్నారి సెల్లార్ నీటిలో మునిగి మృతి చెందింది..



చాంద్రాయణగుట్ట బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో ప్రహరీ గోడ‌ కూలి.. పక్కనే ఉన్న రెండు ఇళ్లపై పడింది. దాంతో ఇళ్లలో నిద్రిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది ఆ శిథిలాల మధ్య చిక్కుకుని మరణించారు. హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఇద్దరు మృతి చెంద‌గా.. నాగోల్‌లో పోస్ట్‌మ‌న్ వ‌ర‌ద‌నీటిలో కొట్టుకుపోయాడు..



అంబ‌ర్‌పేట్‌లో విద్యుత్‌ షాక్‌తో ఒక‌రు చనిపోయారు. బంజారాహిల్స్‌లో ఓడాక్టర్ క‌రెంట్ షాక్‌తో క‌న్నుమూశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంప‌ట్నం మండ‌లంలో గోడ‌కూలి త‌ల్లి, కూతురు మృతిచెందారు.. వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మొత్తంగా 30కు పైగానే ఉంది.



వరద ముంపు నుంచి హైదరాబాద్‌ నగరం ఇప్పుడే కోలుకునేలా లేదు. నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా నీటిముంపులోనే ఉండిపోయాయి. సరూర్‌నగర్‌ చెరువు కట్ట తెగడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దాదాపు 36గంటలకు పైగా కాలనీలు నీటిలో నానుతున్నాయి. నిత్యావసరాలు కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గగన్‌పహడ్‌ వద్ద పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. అప్ప చెరువుకు క్రమంగా వరద తగ్గుతుండడంతో.. సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. కొట్టుకుపోయిన వాహనాలను వెలికి తీస్తున్నారు. అలాగే.. వరద ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లకు శరవేగంగా మరమ్మత్తులు చేస్తున్నారు.



ఇరవై ఏళ్లలో ఎప్పుడూ కురవని వానలు, ఎన్నడూ చూడని వరదలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. రెండు రోజులపాటు ఏకధాటిగా కురిసిన అతి భారీ వర్షాలు నగరంతోపాటు శివారు ప్రాంతాలను కుదిపేశాయి. రోడ్లు, నాలాలు, కుంటలు, చెరువులు, వాగులు పొంగి వరద విలయాన్ని సృష్టించాయి.



మంగళవారంనాడు కేవలం 12 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావటంతో నలువైపులా వరదలు నగరాన్ని ముంచెత్తాయి. ప్రధాన రహదారులు సైతం వాగులను తలపించాయి. హైదరాబాద్‌లో 14 రోజుల్లోనే సాధారణం కంటే 404 శాతం అధికంగావాన లు కురవటంతో నగర ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు.