స్మార్ట్ పోలీసులు : చిన్నారుల కిడ్నాప్ కేసులను చేధిస్తున్నారు

  • Published By: madhu ,Published On : November 15, 2020 / 07:08 AM IST
స్మార్ట్ పోలీసులు : చిన్నారుల కిడ్నాప్ కేసులను చేధిస్తున్నారు

Hyderabad ‘Smart Policing’ : హైదరాబాద్‌ పోలీసులు స్మార్ట్‌ అయ్యారు. ఏ కేసునైనా ఇట్టే ఛేదించేస్తున్నారు. అధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న భాగ్యనగర పోలీస్‌… నిందితులను గంటల్లోనే పట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో కిడ్నాప్‌ కు గురవుతున్న వారిని రక్షిస్తూ… కన్నవారి ప్రశంసలు పొందుతున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీని వరుస కిడ్నాప్‌లు వణికిస్తున్నాయి. వారం రోజుల్లో ఏకంగా నాలుగు కిడ్నాప్‌ కేసులు నమోదవ్వడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల కిడ్నాప్‌లు పాతబస్తీ జనాలను భయపెడుతున్నాయి.



చాంద్రాయణగుట్ట పరిధిలో : –
పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలో ఐదు సంవత్సరాల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. బాలుడు ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులను ఆశ్రయించారు. తమ బిడ్డను రక్షించాలని పోలీసులను ప్రాధేయపడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. కేవలం రెండు గంటల్లోనే బాలుడి ఆచూకీ కనిపెట్టారు.
కిడ్నాప్‌కు గురైన బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.



తల్లిదగ్గర పడుకున్న చిన్నారిని : –
సరిగ్గా మూడు రోజుల క్రితం రెండేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. తల్లిదగ్గర పడుకుని ఉన్న చిన్నారిని ఆగంతకులు ఎత్తుకొని వెళ్లారు. కొంతసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చిన్నారి ఆచూకీ కనిపెట్టి తల్లికి క్షేమంగా అప్పగించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.



నాలుగు కిడ్నాప్ కేసులు : –
మరో రెండు కిడ్నాప్‌ కేసులనూ పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన చిన్నారులను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఈ కేసులను ఛేదించారు. సీసీ కెమెరాల్లో లభ్యమైన చిన్న క్లూ ఆధారంగా తీగలాగితే డొంకంతా కదిలింది. దీంతో నాలుగు కిడ్నాప్‌ కేసుల్లోనూ కిడ్నాపర్స్‌ను అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లో ఎలాంటి నేరం జరిగినా ఖాకీలు సీసీ కెమెరాల ఆధారంగా కేసును త్వరితగతిన ఛేదిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన వెంటనే అలర్ట్‌ అయి ఆయా పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందిస్తున్నారు. అంతేకాదు.. అన్ని సీసీ సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించి కేసు చిక్కుముడి విప్పుతున్నారు.



ఖాకీల పనితీరుపై ప్రశంసలు : –
హైదరాబాద్‌లో కిడ్నాప్‌ కేసులను ఓ ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. చిన్నారులను సురక్షితంగా కాపాడుతున్నారు. దీంతో ఖాకీల పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. కిడ్నాప్‌కు గురైన చిన్నారులు వస్తారో రానో అని బాధపడుతున్న తల్లిదండ్రుల శోకాన్ని.. తీర్చుతున్నారు. పక్కా ప్రణాళికతో కిడ్నాప్‌ కేసులను ఛేదిస్తూ నిందితులను అరెస్ట్‌ చేస్తున్నారు. కన్నవారికి శోకం లేకుండా కాపాడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు.