Gold Jewellery Robbery Case : రూ.7కోట్ల విలువైన బంగారు నగలతో కారు డ్రైవర్ పరారీ కేసు.. శ్రీనివాస్ దొరికాడు

హైదరాబాద్ లో సంచలనం రేపిన ఎస్ఆర్ నగర్ గోల్డ్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారు ఆభరణాలు చోరీ చేసిన కారు డ్రైవర్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Gold Jewellery Robbery Case : రూ.7కోట్ల విలువైన బంగారు నగలతో కారు డ్రైవర్ పరారీ కేసు.. శ్రీనివాస్ దొరికాడు

Gold Jewellery Robbery Case : హైదరాబాద్ లో సంచలనం రేపిన ఎస్ఆర్ నగర్ గోల్డ్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారు ఆభరణాలు చోరీ చేసిన కారు డ్రైవర్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మంలో శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో 5 రోజుల క్రితం రూ.7కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో శ్రీనివాస్ ప్రధాన నిందితుడు.

బంగారు నగల చోరీ తర్వాత పలు ప్రాంతాల్లో తిరిగాడు శ్రీనివాస్‌. చివరకు పోలీసులు దొరికిపోయాడు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆభరణాల దోపిడీకి సంబంధించి శ్రీనివాస్‌ ఒక్కడే ఈ పని చేశాడా? లేక ఎవరైనా సహకరించారా? అనే విషయాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ లో నివాసం ఉండే రాధిక.. నగల వ్యాపారం చేస్తారు. వజ్రాభరణాలు కొనుగోలు చేసి ఆర్డర్లపై సప్లయ్ చేస్తుంటారు. రాధిక ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే ఉంటే అనూష రూ.50 లక్షలు విలువ చేసే నగలను ఆర్డర్ ఇచ్చారు. అయితే డెలివరీ చేసే సమయానికి అనూష అపార్ట్‌మెంట్‌లో లేరు.

అనూష‌కు కాల్ చేయగా.. మధురానగర్‌లోని తన బంధువుల ఇంటి వద్ద ఉన్నానని, నగలను అక్కడికి పంపించాలని చెప్పారు. దాంతో అనూష చెప్పిన అడ్రస్‌కు తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌, సేల్స్‌మెన్‌ అక్షయ్‌తో వజ్రాభరణాలను పంపించారు రాధిక. లొకేషన్ కి వెళ్లాక సేల్స్‌మెన్‌ అక్షయ్ కారు దిగాడు. నగలను డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఇంతలో డ్రైవర్‌ శ్రీనివాస్‌ కారుతో ఉడాయించాడు.

ఆందోళనకు గురైన సేల్స్‌మెన్ వెంటనే రాధికకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. రాధిక వెంటనే ఎస్ఆర్ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డ్రైవర్ శ్రీనివాస్ కారుతో ఉడాయించాడని, ఆ కారులో రూ. 7కోట్ల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయని.. వాటిని పంజాగుట్టలోని జెమ్స్ అండ్ జువెలర్స్ దుకాణంలో ఇవ్వాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. డ్రైవర్‌ శ్రీనివాస్ కోసం వేట మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాలతో గాలించారు. 7 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలతో కారు డ్రైవర్ ఉడాయించడం సంచలనం రేపింది.