Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్రకు నన్ను పిలవలేదు.. భట్టి రమ్మన్నారు, తప్పకుండా వెళతా..

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాదయాత్రకు తనను పిలవలేదని ఆయన వెల్లడించారు.

Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్రకు నన్ను పిలవలేదు.. భట్టి రమ్మన్నారు, తప్పకుండా వెళతా..

Updated On : March 12, 2023 / 1:12 PM IST

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాదయాత్రకు తనను పిలవలేదని ఆయన వెల్లడించారు. మార్చి 16 నుంచి సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో విక్రమార్కతో ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. విక్రమార్క పాదయాత్రలో తాను కూడా పాల్గొనబోతున్నట్టు చెప్పారు.

“విక్రమార్క మండుటెండలో పాదయాత్ర చేయబోతున్నారు. గతంలో వైఎస్ ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో దగ్గరగా చూసిన అనుభవం మాకు ఉంది. పూర్తిగా పాదయాత్ర పెట్టుకున్నావ్ జాగ్రత్తగా నడవండి అని సలహా ఇచ్చాను. పెద్ద సెంటర్ లలో బహిరంగ సభలు పెట్టమని సూచించాను. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి.  రేవంత్ రెడ్డి పాదయాత్రకు నన్ను పిలవలేదు.

మంచిర్యాలతో పాటు జడ్చర్ల లేదా షాద్ నగర్ లో పబ్లిక్ పెడుతున్నాం అన్నారు. నల్గొండలో కూడా బహిరంగ సభ పెట్టాలని కోరాను. వారు కూడా ఒప్పుకున్నారు. తర్వాత నకిరేకల్, సూర్యాపేటలలో కూడా మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టమని కోరాను. ముగింపు సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ.. ఎవరిని పిలుస్తారనేది వారిష్టం. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి శని, ఆదివారాల్లో నేను తప్పకుండా పాదయాత్రలో పాల్గొంటాన”ని కోమటిరెడ్డి అన్నారు.

Also Read: ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తాం, ఒక్క ఛాన్స్ ప్లీజ్: రేవంత్ రెడ్డి

తన పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డిని ఆహ్వానించడానికే ఆయన నివాసానికి వచ్చినట్టు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ”నేను 16 నుంచి పాదయాత్ర చేస్తున్నాను. నా పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డిని ఆహ్వానించాను.ఆయన సానుకూలంగా స్పందించారు. పాదయాత్రలో కోమటిరెడ్డి కూడా పాల్గొంటారు. యాత్రకు కొన్ని సూచనలు చేశారు. పీసీసీ చీఫ్ పాదయాత్ర రేవంత్ రెడ్డి వేరే రూట్ లో వస్తుంది.. నా పాదయాత్ర వేరే రూట్ లో ఉంది. అరవై శాతం టిక్కెట్లు ఖరారయ్యాయనే విషయం నాకు తెలియదు. కాంగ్రెస్ టికెట్లకు సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ప్రకారమే టికెట్ల ఎంపిక ఉంటుంద”ని భట్టి విక్రమార్క చెప్పారు.