Mancherial Constituency: మంచిర్యాల బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై ఐదుగురి కన్ను.. దూకుడు చూపిస్తున్న కాంగ్రెస్, బీజేపీ

మంచిర్యాలలో మూడు పార్టీల నుంచి బలమైన నాయకులే పోటీకి రెడీ అవుతుండటంతో ఈ సారి త్రిముఖ పోరు తప్పేలా కనిపించడం లేదు.

Mancherial Constituency: మంచిర్యాల బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై ఐదుగురి కన్ను.. దూకుడు చూపిస్తున్న కాంగ్రెస్, బీజేపీ

Mancherial Assembly Constituency Ground Report

Mancherial Assembly Constituency: మంచిర్యాల రాజకీయం వాడివేడిగా మారింది. నాలుగుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు (Diwakar Rao Nadipelli) కు ఈ సారి బీఆర్‌ఎస్ టిక్కెట్ దక్కడం కష్టమే అన్న ప్రచారంతో అధికార పార్టీ పాలిటిక్స్‌లో హీట్ పెరిగిపోయింది. ఐదుగురు నేతలు టిక్కెట్‌పై గురిపెట్టడంతోపాటు క్షేత్రస్థాయి ప్రచారానికి రెడీ అయిపోయారు. ఇదే సమయంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) కూడా దూకుడు చూపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ (Kokkirala Surekha), బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ (Raghunath Verabelli) కూడా మంచిర్యాలపైనే ఫోకస్ పెట్టడంతో రాజకీయం రసకందాయంగా మారింది. మూడు పార్టీల ముక్కోణ పోటీలో ఈసారి గెలిచేదెవరు? మంచిర్యాలలో కనిపించబోయే సీనేంటి?

Diwakar Rao Nadipelli

Diwakar Rao Nadipelli

లక్సెట్టిపేట నియోజకవర్గమే 2009లో మంచిర్యాలగా మారింది. మంచిర్యాల, లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్, నస్పూర్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. దాదాపు రెండు లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో నాలుగు సార్లు గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్‌రావు. రెండుసార్లు కాంగ్రెస్, రెండు సార్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్‌రావు.. ఐదోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఐతే ఆయనపై క్యాడర్ నుంచి వ్యతిరేకత వస్తోంది. అధిష్టానం కూడా దివాకర్‌రావును మార్చాలని అనుకుంటోందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తనకు కాకపోతే తన కుమారుడు విజిత్‌రావుకైనా (Nadipelly Vijith Rao) చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు ఎమ్మెల్యే.

Nadipelly Vijith Rao

Nadipelly Vijith Rao

ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మంచిర్యాలను కొత్తగా జిల్లా చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. ఐతే జిల్లా కేంద్రంగా మారినా మంచిర్యాల పట్టణంలో అశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. వర్షాలు, ఎల్లంపల్లి వరదలతో ఏటా ముంపు సమస్య ఎదుర్కొంటోంది మంచిర్యాల పట్టణం. గోదావరి వరద నుంచి రక్షణ కోసం కరకట్ట నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కూడా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. రెండు పంటలకు నీరివ్వాలనే లక్ష్యంతో చేపట్టిన గూడెం లిఫ్ట్ తరచూ మొరాయిస్తోంది. అదేవిధంగా ఫైఓవర్లు, రోడ్ల నిర్మాణం, కాలువలు సరిగాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండే మంచిర్యాల పట్టణంలో కనీస సౌకర్యాలపై స్థానిక నేతలు దృష్టి పెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Puskur Ram Mohan Rao

Puskur Ram Mohan Rao

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు ఈసారి పరిస్థితులు సానుకూలంగా కనిపించడంలేదని చెబుతున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోవడంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చే విషయం డైలమాలో పడింది బీఆర్‌ఎస్ అధిష్టానం. ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారనే ప్రచారమే ఎక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి (Arvind Reddy), సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూర్ రామ్మోహన్ రావు (Puskur Ram Mohan Rao) కూడా ఆశలు పెంచుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తున్న రామ్మోహనరావు స్థానిక నేతలతో టచ్లో ఉంటున్నారు. సిమెంట్ కంపెనీ లేబర్ యూనియన్కి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్‌రావుకు కార్మికుల మద్దుతు ఎక్కువగా ఉంది. అధిష్టానం కూడా ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ (Puranam Satish Kumar), జాగృతి నేత, అడ్వకేట్ తిరుపతి వర్మ కూడా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

PremSagar Rao Kokkirala

PremSagar Rao Kokkirala

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కొక్కిరాల (PremSagar Rao Kokkirala), ఆయన సతీమణి సురేఖ.. ఎవరో ఒకరు బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సురేఖ గడపగడపకు కాంగ్రెస్ పేరుతో ఒకసారి నియోజకవర్గాన్ని చుట్టేశారు. పాదయాత్ర, పరామర్శ అంటూ నిత్యం జనాల్లోనే ఉంటున్నారు సురేఖ. తన భర్తకు లేదా తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టామని, సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయంటున్నారు.

Also Read: మంథనిలో కాంగ్రెస్ ధీమా.. మరో చాన్స్ ఇవ్వమంటున్న మధు.. బీజేపీ పరిస్థితి ఏంటి?

Raghunath Verabelli

Raghunath Verabelli

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా నియోజకవర్గంలో బలంగా ఉంది. సీనియర్ నేత రఘునాథ్ రావ్ మంచిర్యాల బీజేపీ టిక్కెట్‌పై కన్నేశారు. రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుతున్న రఘునాథ్‌రావ్ మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి ఫాలోవర్గా బీజేపీ హైకమాండ్‌లో గ్రిప్ సంపాదించారు. పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అండదండలు రఘునాథ్‌రావ్‌కే ఉన్నాయని చెబుతున్నారు. బిఆర్ఎస్ పాలనలో మంచిర్యాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెబుతున్న రఘునాథ్‌రావ్.. కాంగ్రెస్ రౌడీయిజంతో జనం విసిగిపోయారని… అందుకే ఈ సారి తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఖానాపూర్ బీఆర్ఎస్ టిక్కెట్ కు బహుముఖ పోటీ.. ఎవరికి దక్కేనో?

మూడు పార్టీల నుంచి బలమైన నాయకులే పోటీకి రెడీ అవుతుండటంతో ఈ సారి మంచిర్యాలలో త్రిముఖ పోరు తప్పేలా కనిపించడం లేదు. బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్య పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మూడు పార్టీల నేతలు ప్రచారం కూడా చేస్తుండటంతో మంచిర్యాలలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.