మంథని కపుల్స్ మర్డర్ : నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్, కావాలనే పోలీసులు పట్టించుకోలేదా?

మంథని కపుల్స్ మర్డర్ : నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్, కావాలనే పోలీసులు పట్టించుకోలేదా?

Manthani Couples Murder : లాయర్ వామన్ రావు, ఆయన భార్య నాగమణిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు మంథని మున్సిపల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వారిని కోర్టులో ప్రవేశ పెట్టగా.. కోర్టు రిమాండ్‌కు తరలించింది. ముగ్గురి నిందితులను కోర్టు వద్దకు తీసుకురావడంతో గుంజపడుగు గ్రామస్తులు కూడా కోర్టు ముందు భారీగా గుమికూడారు. గ్రామంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసులో ముగ్గురు నిందితులను తొలిసారి కోర్టుకు తీసుకురావడంతో భారీగా జనం వచ్చారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కోర్టు వద్దకు కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీనివాస్ అనుచరులు కూడా భారీగా చేరుకున్నారు. వారిద్దరికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

మంథని కపుల్స్ మర్డర్స్ కేసులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. తమకు సమస్య ఉందని వామన్ రావు భార్య ఫిర్యాదు చేసినా ఖాకీలు పట్టించుకోకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టే మరో ఆడియో బయటకు వచ్చింది. ముందుగానే కంప్లయింట్ చేసినా పోలీుసులు పట్టించుకోకపోవడమే వామనరావు, నాగమణిల హత్యలకు దారి తీసిందని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పెద్దపల్లి డీసీపీ రవీందర్‌తో నాగమణి హత్యకు ముందు ఫోన్‌లో మాట్లాడారు. గుంజపడగలో రామాలయం విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై సీపీకి, డయల్‌ 100కు ఫోన్‌ చేసినా పట్టించుకోలేదని తెలిపారు. కుంటశ్రీను జోక్యంతోనే గొడవలు జరుగుతున్నాయని వాటిని పరిష్కరించాలని ఆమె కోరారు. అయితే దీనిపై సర్పంచ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు డీసీపీ. అన్ని కేసుల్లో జోక్యం చేసుకోలేమని ఆమెకు సమాధానం ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేప్.. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాగమణి ఎన్నిసార్లు చెప్పినా.. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడమే తప్ప.. రక్షణ కల్పిస్తామని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పలేకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. కావాలనే పోలీసులు పట్టించుకోలేదా? లేక రాజకీయ ఒత్తిడి వల్ల మనకెందుకులే అని వదిలేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమస్యలను గ్రామంలో పరిష్కరించుకోవాలని డీసీపీ సూచించిన విధానమే పోలీసుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారినట్లు తెలుస్తోంది.