Telangana Politics: కేసీఆర్ అంత మాటన్నారా? మోదీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, అందుకే అక్కడి స్థానిక పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కరోనాకు మందు కనిపెట్టారని కొనియాడారు.

Telangana Politics: కేసీఆర్ అంత మాటన్నారా? మోదీ సంచలన వ్యాఖ్యలు

Updated On : October 3, 2023 / 6:37 PM IST

Modi on KCR: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేతో చేతులు కలుపుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకు తాను ఒప్పుకోలేదని కూడా స్పష్టం చేశారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మంగళవారం నిజాబామాద్ జిల్లాలో పర్యటించారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన జనగర్జన బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకును ఆశీర్వదించమంటూ తనను కేసీఆర్ కోరారని అన్నారు. ఈ ఆశీర్వాదం వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.

‘‘తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటోంది. ఎంతోమంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ సాకారమైంది. కానీ తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడింది. కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగింది. కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా బీఆర్ఎస్ దోచుకుంటోంది. కుటుంబ పాలనకు ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వొద్దు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదు’’ అని మోదీ అన్నారు.

Also Read: బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఆర్ఎస్‭పీ పోటీ ఎక్కడి నుంచో తేలిపోయింది

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కేసీఆర్ గతంలో హైదరాబాద్ ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ఉన్నారు. ఆర్భాటంగా స్వాగతం పలికారు. ఇప్పుడేమైంది? మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయింది. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదు. కాంగ్రెస్ కూటమి రానీయక పోవడంతో మళ్లీ నా దగ్గరికి కేసీఆర్ వచ్చారు. తన కొడుకును ఆశీర్వదించమని అడిగారు. నేను నిరాకరించాను. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్ భయపడుతున్నారు’’ అని అన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తెరచాటు ఒప్పందం ఉందని మోదీ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కు ఇలాగే చీకటి ఒప్పందాలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, అందుకే అక్కడి స్థానిక పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కరోనాకు మందు కనిపెట్టారని కొనియాడారు. ఇక నిజాం నవాబులు హైదరాబాద్‌ను వదలకపోతే ఒకే ఒక్క గుజరాతీ బిడ్డ వల్లబాభాయ్ పటేల్ వారిని తరిమేశారని మోదీ అన్నారు.