వాట్సాప్‌లో కొత్త తరహా మోసం, లక్షన్నర పొగొట్టుకున్న టెకీ

వాట్సాప్‌లో కొత్త తరహా మోసం, లక్షన్నర పొగొట్టుకున్న టెకీ

new kind of cyber crime in whatsapp: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకుని అడ్డంగా దోచేస్తున్నారు. నిన్నటి వరకు ఫేస్ బుక్ ను వాడుకున్న సైబర్ నేరగాళ్లు తాజాగా వాట్సప్ యాప్ ను ఆర్థిక నేరాలకు కేంద్రంగా చేసుకున్నారు. వాట్సాప్ ద్వారా జరుగుతున్న నయా మోసాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.

ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఆ తర్వాత ఆపదలో ఉన్నామంటూ ఫ్రెండ్స్ కి మెసేజ్ లు పంపి డబ్బులు దండుకున్న కేసులు కొన్ని రోజులుగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహా చీటింగ్ వాట్సాప్ కి పాకింది. సేమ్ డీపీ, కాస్త సేమ్ ఉండే నెంబర్ తో ఫ్రెండ్ లా చాట్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఆపదలో ఉన్నామంటూ, అర్జంట్ అంటూ డబ్బు దండుకుంటున్నారు. హైదరాబాద్ కి చెందిన ఓ టెకీ.. తన స్నేహితురాలే అనుకుని.. ఏకంగా లక్షన్నర పొగొట్టుకున్నాడు.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పనిచేసేవాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో అమెరికా నుంచి తిరిగొచ్చి హైదరాబాద్ నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం అతడి వాట్సాప్ కు ఓ కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. డీపీ చూస్తే తనకు బాగా తెలిసిన స్నేహితురాలే. ఏం మెసేజ్ ఉందా అని చూస్తే ‘నాకు అత్యవసరంగా 1.50 లక్షలు కావాలి. పది రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను’ అని ఉంది. ఎప్పుడూ ఏమీ అడగని స్నేహితురాలు ఎంతో అర్జెంట్ అయితేనే అడుగుతుందని అతడికి అనిపించింది. ఆ మెసేజ్ లో చెప్పినట్టుగా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల ద్వారా ఆమెకు డబ్బు పంపాడు. ఆ తర్వాత మరుసటి రోజు.. అంత అవసరం ఏమొచ్చిందా అని ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె చెప్పింది విని షాక్ అయ్యాడు.

‘నేను నిన్ను డబ్బు అడగటం ఏంటి. అసలు ఎలాంటి మెసేజ్ పంపలేదు. నా నెంబర్ ఏమీ మారలేదు’ అని ఆమె చెప్పింది. అంతే, అతడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. తాను మోసపోయానని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. వెంటనే బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీలను మార్చి, జనాలను ఏమార్చి మోసాలకు పాల్పడుతున్నారని ఈ ఫిర్యాదు ద్వారా పోలీసులు గ్రహించారు. అదే తరహాలో మరో రెండు ఘటనలు కూడా జరిగినట్టు తెలిసింది. ఒకరు రూ.27వేలు పంపగా, మరో వ్యక్తి రూ.33 వేలు పంపినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు జనాలను అప్రమత్తం చేశారు. ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆపదలో ఉన్నామని, డబ్బు అవసరం ఉందని మెసేజ్ లు వస్తే.. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని చెప్పారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చేసుకున్నాకే.. నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సో, బీ కేర్ ఫుల్. మన అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష.