Hyderabad People : కరోనాకు వెల్ కం చెబుతున్న జనాలు, మాస్క్ లేకపోతే ఏంటీ ? ఇలా అయితే ఎలా ?

వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది ఇంకా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మాస్క్‌లు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

Hyderabad People : కరోనాకు వెల్ కం చెబుతున్న జనాలు, మాస్క్ లేకపోతే ఏంటీ ? ఇలా అయితే ఎలా ?

Hyderabad

People ignore masks :వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది ఇంకా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మాస్క్‌లు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వైరస్‌ ముప్పు ముంచుకొస్తున్నా… ఏమీ కాదులే అన్న నిర్లక్ష్యంతో ఉన్నారు. జనం ఎక్కువ సంచరించే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లలో కూడా చాలా మంది మాస్క్‌లు పెట్టుకోవడంలేదు. తనిఖీలు కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో అయితే మాస్క్‌లు పెట్టుకునే వారే కనిపించడంలేదు. కండక్టర్లు, డ్రైవర్లు, బస్ స్టాప్స్‌లో ఉంటున్న సూపర్‌ వైజర్లు కూడా ప్రయాణికులకు ఈ విషయంలో అవగాహన కల్పించడం లేదు. తోటి ప్రయాణికులు ఎవరైనా మాస్క్‌ పెట్టుకోమని చెబితే మీకెందుకని ఎదిరించే పరిస్థితి ఉంది. వీటన్నింటికి చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్‌ను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది.

మాస్క్‌లు పెట్టుకోకుండా తిరుగుతున్న వారికి పోలీసులు ఎక్కడికక్కడ అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో వారం రోజుల పాటు అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని కొనసాగించి ఆ తర్వాత కూడా మాస్క్‌ పెట్టుకోని వారికి ఫైన్‌ విధించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ చట్టం, ఎపిడిమిక్స్‌ చట్టం ప్రకారం వెయ్యి రూపాయల ఫైన్‌ విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలేదు. మాస్క్‌ పెట్టుకోమని మొత్తుకుంటున్నా… పట్టించుకునే దిక్కులేదు. కేసులు పెరుగుతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఉపేక్షిస్తే మహమ్మారి మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. కేసులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని గ్రహించిన పోలీసు శాఖ.. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో మాస్క్‌ తప్పనిసరి చేసింది. పెట్టుకోపోతే తాట తీస్తామని పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ కొసాగుతున్నా.. చాలా మంది మాస్క్‌ పెట్టుకోకుండానే రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వారికి పోలీసులు ఫైన్లు విధిస్తున్నారు. విపత్తుల నిర్వహణ చట్టం కింది ఏప్రిల్‌ 30 వరకు మాస్క్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు.. సభలు, సమావేశాల్లో కూడా మాస్క్‌లు పెట్టుకోవడంలేదు. ఫంక్షన్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రాంతాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు.

దీంతో బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాలు, ఫంక్షన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కరోనా నిబంధనలకు లోబడి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. అలాంటి చోట్ల ప్రత్యేక నిఘా పెట్టి.. మాస్క్‌ నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మాస్క్‌ పెట్టుకోమని వైద్యాధికారులు గొంతు చించుకుంటున్నా పట్టించుకునే దిక్కులేదు. భౌతికదూరం పాటించాలన్న నిబంధనలను చాలా మంది తలకెక్కించుకోవడంలేదు. మాస్క్‌ పెట్టుకోడాన్ని నామోషీగా భావిస్తున్నారు. పెట్టుకోమని చెబితే చాలా మందికి కోపం వస్తోంది. నాకే చెబుతావా.. అంటూ హూంకరిస్తున్నారు. ఫైన్‌తోనే ఇలాంటి వాటికి చెక్‌ పెట్టొచ్చని భావిస్తున్న ప్రభుత్వం జరిమానాలపై దృష్టి పెట్టింది.