Kcr : పాకిస్థాన్, పుల్వామా పేరు చెప్పి పదేళ్లు పూర్తి చేసుకున్నారు- బీజేపీపై కేసీఆర్ నిప్పులు

మేధావులు ఆలోచించాలి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో దేశం నాశనమైంది. రూపాయి విలువ పతనమైంది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదు.

Kcr : పాకిస్థాన్, పుల్వామా పేరు చెప్పి పదేళ్లు పూర్తి చేసుకున్నారు- బీజేపీపై కేసీఆర్ నిప్పులు

Kcr Slams Bjp And Congress (Photo Credit : Facebook)

Kcr Slams Bjp : కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి నోటికొచ్చిన హామీలతో గద్దెనెక్కిందని మండిపడ్డారు కేసీఆర్. కరీంనగర్ లో తెలంగాణ చౌక్ లో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. పుల్వామ, పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పదేళ్లు పూర్తి చేసుకున్నారని బీజేపీపై మండిపడ్డారు కేసీఆర్. మేధావులు ఆలోచించాలి అని పిలుపునిచ్చిన కేసీఆర్.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో దేశం నాశనమైందని వాపోయారు. కరీంనగర్ లో తెలంగాణ చౌక్ లో రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు.

”150 హామీలిచ్చి ఒక్కటి కూడా చేయని వ్యక్తి ప్రధాని మోదీ. అచ్చేదిన్ అని చెప్పి ధరలు పెంచడం తప్ప అచ్చేదిన్ రాలేదు. వికసిత భారత్ కాలేదు. కానీ, .. విఫల భారత్ అయ్యింది. నల్లధనం తెచ్చి ఇస్తా అన్నారు. ఏడ పోయింది? బండి సంజయ్ తెచ్చి ఇచ్చారా? అంతా వట్టిదే. పుల్వామ, పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. మేధావులు ఆలోచించాలి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో దేశం నాశనమైంది. రూపాయి విలువ పతనమైంది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదు. ఢిల్లీలో దీక్ష జరిగితే ప్రాణాలు పొట్టన పెట్టుకున్న వ్యక్తి మోదీ. ప్రజల మధ్యన చీలికలు తెచ్చి.. కార్పొరేట్ల కోసం కోట్ల రూపాయలు అప్పగిస్తున్నారు.

మేధావులు ఆలోచించాలి.. ఈ గడ్డ మామూలు గడ్డ కాదు.. ఆనాడు రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన గడ్డ కరీంనగర్. ఉపఎన్నిక వస్తే నన్ను గుండెల్లో పెట్టుకున్న గడ్డ కరీంనగర్. ఉద్యమంలో మర్చిపోలేని పాత్ర కరీంనగర్. ప్రతీ జిల్లాలో నవోదయ పాఠశాల ఇవ్వాలని కోరితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా నా మెడ మీద కత్తి పెట్టి మీటర్లకు మోటార్లు పెట్టాలని షరతు విధించారు. నువ్వు ఏమన్నా చేసుకో నేను మీటర్లు పెట్టనని చెప్పా.

నలుగురు ఎంపీలు గెలిచి నాలుగు రూపాయల పని చేయలేదు. స్మార్ట్ సిటీ తెచ్చింది వినోద్ కుమార్. 2వేల కోట్లతో సుందర నగరాన్ని చేసింది గంగుల కమలాకర్. బండి సంజయ్ తో పైసా పని కాలేదు. ఆయనకు భాష రాదు. మాట్లాడితే అర్థం కాని పరిస్థితి. మేధావి అయిన వినోద్ కుమార్ ను పార్లమెంటుకు పంపాలి. ఇప్పటికే నష్టపోయాం. మరోసారి మోసపోవద్దు.

కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి నోటికొచ్చిన హామీలతో గద్దెనెక్కింది. ఒక్కరికైనా తులం బంగారం, మనిషికి 2500 వచ్చాయా? పొన్నం ప్రభాకర్ ఇచ్చారా? రైతులకు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9కి ఇస్తానని చెప్పి ఇప్పటికీ రాలేదు. అనేక రకాలుగా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు. ఫ్రీ బస్ ఒక్కటి ఇచ్చారు. దాంతో సర్కస్ లో కోట్లాటలు జరిగినట్లు జరుగుతున్నాయి. రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లోకి మళ్ళీ బోర్లు వస్తున్నాయి. తొమ్మిదేళ్లు నడిపిన కరెంట్ మాయమైంది. మళ్లీ కరెంట్ పోతోంది.

కాళేశ్వరంలో ఏదో ఉందని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టారు. సాగు, తాగు నీటి అవస్థలు చూసి నాకు బాధగా ఉంది. కష్టమో నష్టమో ఆనాడు నడిపించాం. తడిసిన వడ్లు కూడా కొన్నం. 5 ఎకరాలు దాటిన వారికి రైతుబందు ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు వాళ్ళు ఏం పాపం చేశారు?
ఈ ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అర్థం కావటం లేదు. 420 హామీలు ఇచ్చారు. అందరినీ మోసం చేశారు. 2500 ప్రతీ మహిళకు ఇస్తున్నాం అని రాహుల్ గాంధీ అబద్దాలు చెప్పారు. ఒక్కరికీ రూపాయి కూడా రాలేదు. వచ్చే పరిస్థితి కూడా లేదు. కరీంనగర్ కు ఎప్పుడు వచ్చినా అద్భుతమైన స్వాగతం పలికారు. నా సర్వే ప్రకారం వినోద్ కుమార్ గెలుపు ఖాయమైంది. 8 శాతంతో ముందు వరుసలో ఉన్నారు” అని కేసీఆర్ జోస్యం చెప్పారు.

Also Read : బీజేపీ మళ్లీ గెలిస్తే జరిగేది ఇదే, 400 సీట్లు అడుగుతున్నది అందుకే..- 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి