Telangana : మావోలను మట్టుపెట్టటానికి తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌

తెలంగాణ సరిహద్దుల్లో.. మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న ఏజెన్సీలో..మరోసారి మావోయిస్ట్ దళాల సంచారం కలకలం రేపుతోంది. ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ.. టార్గెట్లకు మావోలు వార్నింగ్‌లు ఇస్తుండటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్ట్ వ్యవస్థ నిర్మూలనకు.. తెలంగాణ, చత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంప్‌ని కూడా ఏర్పాటు చేశారు.

Telangana : మావోలను మట్టుపెట్టటానికి తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌

Maoist Moments In Telangana-Chhattisgarh Borders

Maoist Moments In Telangana-Chhattisgarh Borders : తెలంగాణ సరిహద్దుల్లో.. మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న ఏజెన్సీలో.. మావోయిస్ట్ దళాల సంచారం కలకలం రేపుతోంది. ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ.. టార్గెట్లకు మావోలు వార్నింగ్‌లు ఇస్తుండటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్ట్ వ్యవస్థ నిర్మూలనకు.. తెలంగాణ, చత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంప్‌ని కూడా ఏర్పాటు చేశారు.

చాలా కాలం తర్వాత సరిహద్దుల్లో మళ్లీ మావోయిస్ట్ దళాల సంచారం మొదలైంది. దీంతో.. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడవిలో మళ్లీ పట్టు సాధించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఎన్‌కౌంటర్లు, నిర్బంధాలు, కరోనాతో సతమతమైన మావోయిస్ట్ పార్టీకి.. మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చత్తీస్‌గఢ్ షెల్టర్ జోన్‌లో నుంచి సరిహద్దులు దాటి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఉనికి కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులను కట్టడి చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. దళాల మూలాలపై కన్నేయడంతో పాటు వారిని మానసికంగా బలహీనపర్చడంపై పోలీసులు దృష్టి పెట్టారు.

సరిహద్దుల్లో మావోయిస్టుల నిర్మూలనకు.. తెలంగాణ-చత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ చేపట్టారు. తాజాగా.. మావోయిస్ట్ కార్యకలాపాలు అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, సీఆర్‌పీఎఫ్‌ డీజీపీ కుల్దీప్‌సింగ్‌ పర్యటించారు. చెన్నాపురంలో ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్‌ఫోర్స్ క్యాంపును సందర్శించి.. మావోయిస్టుల కదలికల గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్యాంప్‌లో.. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ కోసం కోబ్రా, డీఆర్‌జీ, గ్రేహౌండ్స్ బలగాలు సిద్ధంగా ఉంటాయి. అంతేకాదు.. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో.. ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ భారీగా బలగాలను మోహరించింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరు ప్రాంతాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్‌పీఎఫ్‌ బలగాల సమన్వయంతో నిఘా ఏర్పాటు చేశారు. అమాయక గిరిజనులను హతమారుస్తున్న మావోయిస్టులు.. తెలంగాణలో ప్రజల ఆదరణ కొల్పోయారని.. డీజీపీ మహేందర్ రెడ్డి చెబుతున్నారు.

ఇక.. మావోయిస్టుల వేటలో.. చత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా కమాండోలు భాగమయ్యారు. దట్టమైన అడవులు, వాగులు, వంకలు దాటుతూ.. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏకే-47 గన్ పట్టుకొని.. బ్యాక్ ప్యాక్‌లో 20 కిలోల దాకా సామాగ్రిని నింపుకొని.. అదనపు తూటాలు, మేగజీన్లతో.. కొండలు, గుట్టలు ఎక్కుతూ.. మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు వేట సాగిస్తున్నారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం.. స్పెషల్‌గా 20 మంది మహిళా పోలీసులకు కమాండ్ ట్రైనింగ్ ఇచ్చి.. డీఆర్‌జీ తరఫున కూంబింగ్‌కు పంపింది. వీళ్లు.. ప్రస్తుతం బీజాపూర్ అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా.. తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తూ.. తమ విధులను కొనసాగిస్తున్నారు. మావోయిస్టులకు షెల్టర్ ఇస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. వాళ్లను పట్టిస్తే లక్షల్లో రివార్డులు ఇస్తామంటూ ఇప్పటికే పోలీస్ శాఖ ప్రకటించింది.

చత్తీస్‌గఢ్ దండకారణ్యమే.. మావోయిస్టులకు కంచుకోట. అగ్ర నాయకులందరికీ.. దట్టమైన అడవులే షెల్టర్ జోన్‌గా కొనసాగుతున్నాయి. అక్కడి నుంచే.. తెలంగాణ సరిహద్దుల్లో ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వర్షాలకు.. అడవులు పచ్చబడటంతో.. కార్యాచరణ మొదలుపెట్టినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా.. మావోయిస్టుల గురించిన సమాచారం చేరవేస్తున్న కొరియర్లను.. హతమారుస్తూ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అంతేకాదు.. తెలంగాణ సరిహద్దుల్లో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా.. బీజాపూర్ జిల్లా హోసూరు బ్లాక్ పరిధిలోని దండకారణ్యంలో.. మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కొద్ది రోజుల కిందటే భారీ స్థాయిలో నిర్వహించినట్లు స్టేట్ ఇంటలిజెన్స్ పసిగట్టింది. ములుగు, వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం చుట్టూ ల్యాండ్ మైన్‌లు అమర్చి.. ఏకంగా పోలీసులకే సవాల్ విసిరారు. గత జులై 28 నుంచి ఆగస్ట్ 3 వరకు ఈ వారోత్సవాలు జరిగాయి. పక్కా ప్రణాళికతోనే.. ఇన్ని రోజులు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగింపు సభలో 12 వేల మందికి పైగా ప్రజలు, 2 వేల మంది మావోయిస్టులు.. పాల్గొన్నట్లు చెబుతున్నారు.

మావోయిస్ట్ దళాలు.. భారీ ఎత్తున జనసమీకరణ చేసి పార్టీని విస్తృతం చేసేలా.. రాష్ట్ర కమిటీ బాధ్యతలు చూస్తున్న దామోదర్ దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే.. దండకారణ్యం దాటి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లోకి.. మావోయిస్ట్ దళం చేరిందన్న సమాచారం పోలీసులకు చేరింది. దానిని నిజం చేస్తూ.. తాడ్వాయి మండలం వీరాపురం గుట్టలు, గుండాల మండలం దామెరతోగు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలకు.. మావోయిస్ట్ దళాలు కనిపించాయి. కానీ.. పోలీసులను ముందే పసిగట్టిన మావోయిస్టులు.. అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీంతో.. భారీ ఎన్ కౌంటర్ తప్పింది.

మరోవైపు.. తెలంగాణ మావోయిస్ట్ కమిటీ చీఫ్ నియామకంపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యాప నారాయణ కరోనాతో మృతి చెందాక.. పూర్తిస్థాయిలో తెలంగాణ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. ఫలితంగా.. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు తగ్గాయి. దీంతో.. మళ్లీ తమ ఉనికిని చాటుకునేందుకు పూర్తి స్థాయి బాధ్యతలను ఎవరికైనా అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి.. చంద్రన్న సారథ్యంలోనే కార్యకలాపాలు సాగించాలని భావిస్తున్నా.. అది కూడా ఎక్కువకాలం మంచిది కాదని అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం.