కడుపునొప్పి వస్తుందా.. గర్భసంచి ఆపరేషన్ కు రెడీ కావాల్సిందే

తరచూ పొత్తికడుపులో నొప్పి వస్తున్నా.. నెలసరి సమస్యలు వేధిస్తున్నా.. అజీర్ణంగా ఉన్నా.. ఎవరైనా ఏం చేస్తారు.. సరైన వైద్యుడిని సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. కానీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మహిళలు మాత్రం ఏకంగా పెద్దాపరేషన్‌కు రెడీ కావాల్సిందే.

కడుపునొప్పి వస్తుందా.. గర్భసంచి ఆపరేషన్ కు రెడీ కావాల్సిందే

Stomach Pain Solution Was Only Uterus Operation Warnagal 4773

తరచూ పొత్తికడుపులో నొప్పి వస్తున్నా.. నెలసరి సమస్యలు వేధిస్తున్నా.. అజీర్ణంగా ఉన్నా.. ఎవరైనా ఏం చేస్తారు.. సరైన వైద్యుడిని సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. కానీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మహిళలు మాత్రం ఏకంగా పెద్దాపరేషన్‌కు రెడీ కావాల్సిందే.  కాసులకు కక్కుర్తి పడ్డ కొందరు డాక్టర్లు .. అవసరం  లేకున్నా నిర్ధాక్షిణ్యంగా కడుపులు కోసేస్తూ… అభం శుభం తెలియని అమాయక ఆడపడచులకు..  గర్భశోకం మిగుల్చుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అమాయక మహిళలకు గర్భశోకం కలుగుతోంది. మాతృత్వానికే కాదు – స్త్రీల ఆరోగ్యానికి, అస్తిత్వానికి, ఆయుర్ధాయానికి కూడా మూలాధారమైన గర్భసంచులు.. మూడు పదుల వయసు దాటక ముందే తీసేస్తున్నారు. గర్భాశయం అంటే కేవలం సంతానం కోసమేనని .. పిల్లలు కలిగాక ఇక దానితో ఏ ప్రయోజనం ఉండదని .. అమాయకంగా నమ్ముతున్న ఎంతో మంది మహిళలు గర్భసంచి తీసేయించుకుంటున్నారు. తరచూ రుతుక్రమం సమస్యలు, పొత్తికడుపు నొప్పి వంటి బాధలన్నింటికి .. ఆపరేషన్‌తో శాశ్వత పరిష్కారమంటూ వైద్యలు ఇచ్చే సలహాతో .. చిన్న  వయస్సులోనే గర్భాశయాన్ని తొలగించుకుంటున్నారు.

గర్భసంచి తీయించుకున్న మహిళలు. వీరిది వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండా. ఇక్కడ సుమారు 70 గిరిజన కుటుంబాలుంటాయి. అంతా రెక్కాడితేగాని డొక్కాడని కష్ట జీవులు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో ఆస్పత్రులు, ఆర్ఎంపీలను  ఆశ్రయించడంతో .. వారంతా గర్భసంచి ఆపరేషన్‌ల బారిన పడ్డారు. ప్రతి ఇంటికో మహిళ గర్భసంచి ఆపరేషన్ చేసుకుంది. అంతా కడుపు నొప్పే కారణంగా చెబుతున్నారు.  గర్భసంచి ఆపరేషన్‌తో శాశ్వతంగా నొప్పి ఉండదు అనే భావనలోకి వెళ్లిన గిరిజన మహిళలంతా ..  ఆపరేషన్‌తో గర్భసంచులు కొల్పోయారు. కానీ  ప్రస్తుతం వారికి ఏమాత్రం ఉపశమనం లేదు. వాళ్లకు ఆ బాధ అదే విధంగా ఉంది.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీమ్లాతండా మహిళల పరిస్థితీ అంతే. ఈ తండాలో 80 కుటుంబాలుంటే.. ఇందులో సగం మంది తల్లులకు గర్భసంచులు తీసేశారు. ఇదే మండలం కాకులబోడు తండాలోను 70కుటుంబాలుంటే.. అందులో సుమారు 40మంది మహిళల్లో మరో ఆలోచన లేకుండానే గర్భసంచి ఆపరేషన్ చేశారు. ఇక తొర్రూరు మండలం చర్లపాలెంలో 230 కుటుంబాలుంటే .. 50మందికిపైగా తల్లులకు చిన్న నొప్పి వస్తేనే .. అది ప్రాణాలు తీసేస్తుందని గర్భసంచి తొలగించారు.

మాతృత్వానికి ప్రతీకలైన గర్భసంచులను .. డాక్టర్లు డబ్బుసంచులుగా మార్చుకోవడం ఎక్కువైంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జరగాల్సిన హిస్టరెక్టమీ ఆపరేషన్లను మంచినీళ్ల ప్రాయంగా చేసేస్తున్నారు. సాధారణ సమస్యలతో డాక్టర్ల వద్దకు పోతే .. ఆయా సమస్యలకు  మాత్రమే వైద్యం చేయాల్సిన కొందరు డాక్టర్లు, డబ్బులకు ఆశపడి గర్భసంచిని తొలగిస్తున్నారు. ఈ సమస్యలు ఎదుర్కొనే వారిలో లక్షలో పదిమందికే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పేరుతో వందల మందికి ఆపరేషన్ చేయడంతో .. మహిళల ఆరోగ్య ప్రమాణాలు రోజురోజుకు పడిపోతున్నాయి.

ఆపరేషన్‌ తర్వాత వచ్చే అనారోగ్య పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో నడి వయసులోనే గ్రామీణ మహిళ నడుం వంగి వృద్ధాప్యంలోకి జారిపోతోంది. నడి వయసులోనే మెనోపాజ్ దశ వచ్చేస్తోంది. ఒక జీవితకాలంలో కొన్ని దశలను శాశ్వతంగా  పోగొట్టుకుంటోంది. ఈ జాఢ్యం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రోజురోజుకు పెరుగుతోంది. గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్సలు రాష్ట్రంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా జరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడించడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

ఎక్కడ ప్రభావం చూపిస్తుంది:
గర్భసంచిని తొలగిస్తే.. హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతినడం, ఎముకలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపడం, మోనోపాజ్‌, బీపీ, చక్కెర వ్యాధి, అండాశయంలో సమస్యలు వంటి సమస్యలతో పాటు మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఈ ప్రమాదం నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు బయటపడాలంటే..  ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో గర్భకోశ వ్యాధుల పరీక్షలను అందుబాటులోకి తేవాలి. ప్యాప్స్‌మేర్‌, హెచ్‌పీవీ వ్యాక్సిన్‌, సీటీఎంఆర్‌లను సర్కారీ దవాఖానాల్లో అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వ వైద్యశాలల్లో గర్భకోశ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల బాధితులు అర్హత లేని వారిని ఆశ్రయిస్తున్నారు.

ఏం జాగ్రత్తలు చేయాలి:
మహిళల్లో ఉన్న తెలియనితనాన్ని సొమ్ము చేసుకుంటున్న తీరుకు అడ్డుకట్ట వేసేందుకు .. ప్రభుత్వం చర్యలు  చేపట్టాలి. గ్రామీణ స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనవసర శస్త్రచికిత్సలతో గర్భసంచిని తొలగిస్తే తలెత్తే పరిణామాలకు ప్రజలకు చేరువ చేయాలి. గర్భకోశ సంబంధ వ్యాధుల పట్ల పాఠశాల దశ నుంచే బాలికల్లో అవగాహన కలిగించాలి. స్త్రీలలో గర్భకోశ వ్యాధులు తలెత్తడానికి అనేక కారణాలున్నాయి.  బాల్యవివాహాలతో పాటు తొందరగా గర్భం దాల్చడం, అవి వరుసగా కొనసాగడం ప్రధాన కారణం. వీటితో పాటు అవగాహన లేకపోవడం, కాన్పుల మధ్య ఎడం  లేకపోవడం, రక్తహీనత, పోషకాహార లోపం, వైద్యులు సూచించే మందులు సక్రమంగా వాడకపోవడం వల్ల ఈ వ్యాధులు సోకుతున్నట్లు  నిపుణులు చెబుతున్నారు.

గర్బసంచిని తీసేస్తే.. ఆ మహిళ ఆయుష్షు తగ్గుదల నిర్ణయమైనట్లే.  కడుపునోప్పి, తెల్లబట్ట వస్తే కచ్చితంగా గర్భసంచి తీసేయించుకోవాల్సిందే అనే అభిప్రాయం గ్రామాల్లో బలంగా నాటుకుపోయింది. ఈ అపోహను తొలగించాల్సిన అవసరం ఉంది. పెద్ద ఆపరేషన్‌లపై విజిలెన్స్‌ అధికారులు విచారించి డాక్టర్లపై,  ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోతే .. ఉమ్మడి వరంగల్ జిల్లా తల్లులకు  గర్భశోకం తప్పదు.