ఇకపై విద్యార్థులు.. రోజు విడిచి రోజు స్కూలుకు.. ఆన్‌లైన్ టీచింగ్

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 01:51 AM IST
ఇకపై విద్యార్థులు.. రోజు విడిచి రోజు స్కూలుకు.. ఆన్‌లైన్ టీచింగ్

కరోనా కాలంలో స్కూల్ వాతావరణం మారిపోనుంది. ఒక్కో విద్యార్థికి వారంలో కొద్దిరోజులు లైవ్ టీచింగ్, మరికొన్ని రోజులు ఆన్‌ లైన్, వీడియో పాఠాలు వినడం.. దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు చేస్తోంది. స్కూల్‌కు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్యను సగానికి కుదించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కూడా ఏడాది వరకు భౌతికదూరం పాటించాల్సిందేనని వైద్య నిపుణుల అంచనా వేస్తున్నారు. దీనిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (MHRD) కసరత్తు ప్రారంభించింది.

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే వేసవి సెలవుల తరువాత ప్రారంభమయ్యే పాఠశాల తరగతి గదుల్లో పాటించాల్సిన భౌతికదూరంపై సమగ్ర నివేదిక అందజేయాలని ఎన్‌ సీఈఆర్‌టీని ఆదేశించింది. ఇప్పటికే ఉన్నత విద్యలో కనీసం 25శాతం ఆన్‌లైన్‌ బోధన చేపట్టేలా కార్యాచరణ రూపొందించుకోవాలని యూజీసీ ఆదేశాలు జారీచేసింది. పాఠశాల విద్యలోనూ చేయాల్సిన మార్పులపై NCTERT నివేదికను రూపొందించి MHRDకి అందజేయనుంది.

మొదటి రోజు సగం మంది స్కూల్‌కు వస్తే.. రెండోరోజు ఆ విద్యార్థులు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్, డిజిటల్‌ పాఠాలు వింటారు. రెండోరోజు స్కూ‌ల్‌కు వచ్చిన మిగతా సగం మంది విద్యార్థులు మూడో రోజు ఆన్‌లైన్, డిజిటల్‌ పాఠాలు వింటారు. ఇక రెండో రోజు ఇంట్లో ఉండి పాఠాలు విన్న విద్యార్థులు మూడోరోజు మళ్లీ స్కూల్‌కు వస్తారు. ఇలా రోజు విడిచి రోజు ప్రత్యక్ష బోధన, ఆన్‌లైన్, డిజి‌టల్‌ బోధన చేపట్టేలా NCERT కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గుతుంది. తద్వారా భౌతికదూరం నిబంధన అమలు చేయడం వీలవుతుందని భావిస్తోంది. మరోవైపు మొత్తం విద్యార్థులకు రోజు విడిచి రోజు స్కూళ్లో బోధన నిర్వహించే అంశంపైనా యోచిస్తున్నట్లు తెలిసింది. ఒకరోజు స్కూల్‌కు వస్తే మరో రోజు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్, డిజిటల్‌ బోధన ద్వారా పాఠాలు వింటారు. ఈ విధానంలో భౌతికదూరం పాటించడం సమస్య కానుంది. ఒకరోజు సగం మందికి లైవ్ టీచింగ్, మిగతా సగం మందికి ఆన్‌లైన్, డిజిటల్‌ బోధనవైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. 

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆన్‌లైన్, డిజిటల్‌ బోధన ప్రధాన సవాల్‌గా మారనుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ టీచర్లను సిద్ధం చేయాలని కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ అడుగులు వేసింది. తద్వారా టీచర్లు ఆన్‌లైన్‌ బోధన చేపట్టేందుకు కూడా సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గురుకులాలు మినహా ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లు 27,432 ఉన్నాయి. ఇందులో 23,36,070 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి 1.24 లక్షల మంది టీచర్లు బోధన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా విద్యార్థులకు శిక్షణ కొనసాగుతోంది. రోజు విడిచి రోజు, ఆన్‌లైన్‌, డిజిటల్‌ బోధనకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను త్వరలోనే కేంద్రం ప్రకటించనుంది. 

Read More :

* ఇంటి వద్దనే సీబీఎస్ఈ పరీక్షా పేపర్ల మూల్యాంకనం

విద్యా విధానంలో కొత్త రూల్స్ : స్కూల్స్ లో సరి – బేసి విధానం