చర్చలు షురూ..ఏపీ – తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు!

  • Published By: madhu ,Published On : August 24, 2020 / 03:00 PM IST
చర్చలు షురూ..ఏపీ – తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు!

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్ లో 2020, ఆగస్టు 24వ తేదీ సోమవారం ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలు జరుపుతున్నారు. విజయవాడ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్ భవన్ కు చేరుకున్నారు.



తెలంగాణ ఆర్టీసీ ఎండీతో సహా..ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. అంతర్ రాష్ట్ర ఒప్పందం రూపకల్పన, అమలు చేయాల్సిన విధానంపై సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ వారంలో ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఏపీ అధికారులు బస్సు సర్వీసుల్ని ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించరాదని టి.సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైదరాబాద్‌ వెలుపల మాత్రమే ఆర్టీసీ బస్సులు తిప్పాలని నిర్ణయించి జిల్లా సర్వీసులు ప్రారంభించింది.



మార్చి 22వ తేదీ నుంచి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. మే 21 తర్వాత మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్టీసీ విడిపోక ముందు ఒప్పందాలు పొరుగు రాష్ట్రాలతో ఏపీఎస్‌ఆర్టీసీ చేసుకుంది.

ఫలితంగా ఆ ఒప్పందాలు ఇప్పుడు ఏపీకే పరిమితమయ్యాయి. కొత్తగా ఏర్పడ్డందున తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అన్ని పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంది. అంతర్ రాష్ట్ర ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.