Pakistan To Adilabad Explosives : పాకిస్తాన్ నుంచి ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు.. విచారణ వేగవంతం

పాకిస్తాన్‌ నుంచి తెచ్చిన ఆయుధాలు ఆదిలాబాద్ లో ఎవరికి చేరవేశారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. (Pakistan To Adilabad Explosives)

Pakistan To Adilabad Explosives : పాకిస్తాన్ నుంచి ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు.. విచారణ వేగవంతం

Adilabad Khalistan Terrorists

Pakistan To Adilabad Explosives : పాకిస్తాన్ నుంచి ఆదిలాబాద్ కు ఆయుధాలు, పేలుడు పదార్ధాల సరఫరా కేసులో విచారణ వేగవంతం అయ్యింది. ఇప్పటికే నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను చేశారు. వారిని ఆదిలాబాద్ కు తరలించి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాదుల దగ్గర లభించిన రూ.22 లక్షల నగదు ఎక్కడిది? ఆయుధాలు, పేలుడు పదార్ధాలు ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో విచారణ జరపనున్నారు.

పాకిస్తాన్ నుంచి హర్యానా మీదుగా ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా అయ్యాయి. పాకిస్తాన్‌ బోర్డర్‌ నుంచి ఆయుధాల చేరవేత కేసుకు సంబంధించి గతంలోనే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాళ్ల నుంచి ప్రాథమికంగా పలు వివరాలు సేకరించారు. ఇప్పుడు వీళ్లను ఆదిలాబాద్‌కు తరలించి వివరాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్‌ నుంచి తెచ్చిన ఆయుధాలను వీళ్లు ఎవరికి చేరవేశారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.(Pakistan To Adilabad Explosives)

ఇప్పటికే అరెస్ట్‌ అయిన నలుగురు నిందితుల దగ్గర 22 లక్షల రూపాయల హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. వీళ్లకు పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు కూడా తేల్చారు. దాయాది దేశం పాకిస్థాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా భారత సరిహద్దులోకి ఉగ్రవాదులు ఆయుధాలను చేరవేస్తున్నారు. ఆ ఆయుధాలను పాక్‌ సరిహద్దు నుంచి ఈ ఖలిస్తాన్‌ ఉగ్రవాద ముఠా హర్యానాకు చేరవేసింది.

Himachal Khalistan: హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ఖలిస్థాన్ జెండాల ఘటనలో కేసులు నమోదు

హర్యానా నుంచి ఆదిలాబాద్‌కు వీటిని తరలించి.. అక్కడి నుంచి నాందేడ్‌కు ఆ ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపించేందుకు ఈ ముఠా కుట్ర పన్నిందని దర్యాప్తులో తేలింది. గతంలోనూ ఈ ముఠా.. పాకిస్తాన్‌ నుంచి నాందేడ్‌కు ఆయుధాలను పంపించిందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో, పోలీసులు మరింత సీరియస్‌గా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ నెల 5న హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ లో పాక్ తో సంబంధాలు ఉన్న టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురుప్రీత్, అమన్ దీప్, పర్మీందర్, భూపేంద్ర ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలు, మందుగుండు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

పాక్ జాతీయుడి ఆదేశాల మేరకు ఆయుధాలను భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తోంది గురుప్రీత్ ముఠా. కాగా.. ఈ ముఠా గత 9 నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆయుధాలను చేరవేసింది. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు ఆయుధాలను, మందుగుండను ఈ ముఠా చేరవేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన న‌లుగురు కూడా ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ బ‌బ్బ‌ర్ ఖాల్సా ఇంట‌ర్నేష‌న‌ల్ (BKI) సంస్థ‌కు చెందిన‌వారుగా పోలీసులు పేర్కొంటున్నారు. పంజాబ్ ఐబీ పోలీసులు, హ‌ర్యానా పోలీసులు సంయుక్తంగా ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించి నలుగురిని పట్టుకున్నారు.

పాకిస్తాన్ లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఖలీస్థానీ ఉగ్రవాది రిండాతో నిందితులకు సంబంధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. భూపేంద్ర సింగ్, పర్మీందర్ లను విచారణ తర్వాత జ్యుడిషీయల్ రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు అమన్‌దీప్, గురుప్రీత్ సింగ్ లను న్యాయ స్థానం అనుమతితో ఆదిలాబాద్ జిల్లాకు తరలించాలని పోలీసులు భావిస్తున్నారు. కర్నాల్ లో అరెస్ట్ అయిన నిందితులు ఆదిలాబాద్ నుండి ఆయుధాలు తరలించాలని ప్లాన్ చేసినట్టుగా విచారణలో ఒప్పుకోవడంతో తెలంగాణ పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు.