TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు

బ్యాంకు అధికారులు, పోలీసుల తీరుపై రైతులు, ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సెక్యూరిటీ గార్డుని కూడా నియమించకపోవడం దారుణం అని బ్యాంకు అధికారులపై మండిపడుతున్నారు. దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు.(TGB Robbery Case)

TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు

Tgb Robbery Case

TGB Robbery Case : వడ్డీ తక్కువే అయినా ప్రజలు తమ డబ్బుని బ్యాంకులోనే దాచుకుంటారు. బ్యాంకు అంటే ప్రజలకు అంత నమ్మకం. తమ సొమ్ముకి భద్రత బ్యాంకు ఇస్తుందని విశ్వసిస్తారు. అలానే లోన్లు తీసుకునేది కూడా ఎక్కువగా బ్యాంకు నుంచే. తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్లు ఇస్తాయని కాదు అంతకుమించి తమ బంగారు ఆభరణాలకు బ్యాంకులు అయితే గట్టి రక్షణ ఇస్తాయి కాబట్టి. ఇలా నమ్మే నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతాదారులు నగదు పొదుపు చేశారు. నగలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. కానీ, హైవే పక్కనే ఉన్న బ్యాంకులో దొంగలు పడ్డారు. ఉన్నదంతా ఊడ్చేశారు. 4కోట్ల రూపాయల విలువ చేసే 8 కిలోల బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గ్యాస్ కట్టర్ లతో లాకర్లు ధ్వంసం చేయడంతో నిప్పురవ్వలు రాజుకుని ఏడు లక్షల 30వేల నగదు కాలి బూడిదైంది. విలువైన డాక్యుమెంట్లు కూడా కాలిపోయాయి. దొంగలు దోచుకెళ్లడంతో నగదు పొదుపు చేసిన ఖాతాదారులు, ఆభరణాలు తాకట్టుపెట్టి లోన్లు తీసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు.

Bussapur Bank Robbery : ప్రొఫెషనల్ దొంగల పనే..! బుస్సాపూర్ బ్యాంకు చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం

బ్యాంకులు పెద్దగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు. కానీ, భారత ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో నడిచే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇచ్చిన ప్రకటన, కట్టిన భారీ ఫ్లెక్సీ చూసేసరికి రుణాలకు ఎగబడ్డారు. ఆభరణాలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. మీ ఆభరణాలకు పూర్తి భద్రత మాది, బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీతో రుణ సదుపాయం అని ఫ్లెక్సీలు కట్టారు తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు. అంతేనా ప్రాసెసింగ్ చార్జీల్లో ఏకంగా 50శాతం తగ్గింపు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు.. ప్రస్తుత వడ్డీ రేటులో 0.25శాతం ప్రత్యేక రాయితీ అంటూ స్పెషల్ ఆఫర్ అనౌన్స్ చేశారు. దీంతో బుస్సాపూర్ రైతులతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన నల్లూరు, సొంటిపేట రైతులు కూడా ఈ బ్రాంచిలో నగలు తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. కానీ, ఇప్పుడా నగలను దొంగలు కాజేశారు.

Bank Robbery : జులాయి సినిమా తరహాలోనే.. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకులో భారీ చోరీ

చోరీ జరగడంతో బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టిన రైతులు, నగదు దాచుకున్న ఖాతాదారులు కలవరపడుతున్నారు. బ్యాంకు అధికారులు, పోలీసుల తీరుపై రైతులు, ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సెక్యూరిటీ గార్డుని కూడా నియమించకపోవడం దారుణం అని బ్యాంకు అధికారులపై మండిపడుతున్నారు. ఇక బుస్సాపూర్ లో రెండు నెలలుగా దొంగతనాలు జరుగుతున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయారు. సిబ్బంది లేకపోవడం వల్లే పహార కాయడం లేదని పోలీసులు చెప్పారని రైతులు తెలిపారు. మొత్తంగా బ్యాంకు అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే దొంగతనం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక చోరీ అయిన బంగారం ఎలా రికవరీ అవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. జులాయి సినిమాలో బ్యాంకు దోపిడీ సీన్ తరహాలో దొంగలు బ్యాంకుకి కన్నమేశారు. గ్యాస్ కట్టర్ తో షట్టర్ కట్ చేసిన దొంగలు.. అదే గ్యాస్ కట్టర్ తో లాకర్ ను కూడా కట్ చేశారు.

గ్యాస్‌ కట్టర్లతో బ్యాంకు లాకర్‌ను ధ్వంసం చేసిన దొంగలు.. రూ.4.46 కోట్ల విలువైన 8.3 కిలోల బంగారం దోచుకెళ్లారు. గ్రామాభివృద్ధి కమిటీ భవనంపై అంతస్తులో ఉన్న బ్యాంకు తాళాలు తొలగించి దొంగలు లోనికి ప్రవేశించారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్లతో కట్టర్లను వినియోగించి స్ట్రాంగ్‌ రూమ్ తాళాలు తొలగించారు. బ్యాంకులో రెండు లాకర్లుండగా తాకట్టు బంగారం ఉంచిన పెద్ద లాకర్‌ను ధ్వంసం చేశారు.

ఇందులో రూ.7.30 లక్షల నగదు, 8.3 కిలోల బంగారు ఆభరణాలు, ఫైల్స్ ఉన్నాయి. గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ తలుపును కోసే క్రమంలో నిప్పురవ్వల కారణంగా 7.30 లక్షల నగదు, ఫైల్స్ కాలి బూడదయ్యాయి. దొంగలు వెంటతెచ్చిన గ్యాస్‌ సిలెండర్లు అక్కడే వదిలేసి బంగారంతో పరారయ్యారు. దొంగలు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి వీడియో రికార్డు జరిగే డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. ఎలుగుబంటి రూపంలో ఉండే మాస్కులు ధరించి వచ్చిన దొంగలు బ్యాంకు ఆవరణలో ఓ మాస్క్‌ వదిలి వెళ్లారు. ఖాతాదారుల ఆభరణాల లాకర్‌కు ఏమీ కాకపోవటంతో మరింత భారీ చోరీ తప్పినట్లయింది.