తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్

Unexpected twist in MLC elections : తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. నామినేషన్ల ఘట్టం దగ్గరపడగానే ఎప్పటిలాగే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ప్రతిపక్ష పార్టీలకు ఊహించని ప్లాన్‌ అమలు చేశారు. పీవీ కూతురును ఎన్నికల బరిలో నిలిపి బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాల్‌ విసిరారు. మరి కేసీఆర్‌ వేసిన ఎత్తుగడకు ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి. కౌంటర్‌ ఎటాక్‌కి ఎలా సిద్ధమవుతున్నాయి ?

మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్ ప‌ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సునాయాసంగా గెలుస్తామనే ధీమాతో ఉండేవారు బీజేపీ నేతలు. ఇక్కడ పోటీ చేసేందుకు టీఆర్ఎస్ కు క‌నీసం అభ్యర్థి కూడా లేడని.. అందుకే ప్రొఫెస‌ర్ నాగేశ్వర్‌కు మద్దతు ఇస్తున్నారంటూ విమర్శలు సైతం చేశారు. త‌మ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే అన్నంత నమ్మకంతో ఉండేవారు కమలనాథులు. అయితే నామినేషన్లకు ఒక్క రోజు ముందు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణిదేవిని ఎన్నికల బరిలో దించబోతున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించి సంచలనం రేపారు. దీంతో కేసీఆర్ వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాల‌న్న దానిపై ఆలోచ‌న‌లో ప‌డింది బీజేపీ.

పీవీ కూతురిని ఎన్నికల బరిలో నిలపడం అంటే మహనీయుడు పీవీని అవమానించడమే అంటూ విమర్శలు చేసిన బీజేపీ వెంటనే రూట్‌ మార్చింది. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్లాన్ బీతో రెడీ అయ్యింది బీజేపీ. కేసీఆర్ అమలు చేస్తోన్న పీవీ ఫ్యామిలీ సెంటిమెంట్‌ను ఎదుర్కొనేందుకు ఆ కుటుంబానికి చెందిన స‌భ్యుల‌తో కౌంట‌ర్‌ ఎటాక్‌కి సిద్ధమైంది. పీవీ కూతురుకు కౌంట‌ర్ గా పీవీ మ‌న‌వ‌డిని రంగంలోకి దింపింది బీజేపీ. బ్రాహ్మణ స‌మాజం ఓట్లు చీల్చేందుకు టీఆర్ఎస్ ప్లాన్ వేసింద‌ని.. కుటిల రాజ‌కీయాల‌తో మ‌హామ‌నిషి పేరు చెప్పి మా కుటుంబాన్ని మోసం చేస్తున్నారంటూ విమర్శలు మొద‌లు పెట్టారు పీవీ మ‌న‌వ‌డు ఎన్వీ సుభాష్. రామచంద్రరావునే గెలిపించాలంటూ ప్రచారం మొదలుపెట్టారు.

ఇక కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి కొత్త చర్చకు తెరలేపారు. బీజేపీతో జరిగిన ఒప్పందంలో భాగంగానే కేసీఆర్‌ పీవీ కూతురు వాణిని పోటీలో నిలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చడమే కేసీఆర్‌ లక్ష్యమన్నారు రేవంత్‌. మరోవైపు… పీవీపై గౌర‌వం ఉంటే మిగ‌తా పార్టీల నేత‌లు త‌మ నామినేష‌న్ లు ఉప‌సంహ‌రించుకోవాలన్నారు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌.

ఈ ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది. పీవీ సెంటిమెంట్ తో టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని చూస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాక‌ర్ విమ‌ర్శిస్తున్నారు. పీవీకి గౌర‌వం ఇవ్వాల‌నుకుంటే ఆయ‌న కూతురు వాణికి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పీవీ కుటుంబ సెంటిమెంట్ అనేది టీఆర్ఎస్, బీజేపీల‌కు ఎంత మేర‌కు వ‌ర్కౌట్ అవుతుంది ? పట్టభద్రులు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.