కరోనా తగ్గిపోయిందని అనుకుంటున్నారా, ఒకే ఊరిలో 33 మందికి వైరస్

కరోనా తగ్గిపోయిందని అనుకుంటున్నారా, ఒకే ఊరిలో 33 మందికి వైరస్

Karimnagar Chegurthi village : కరోనా తగ్గిపోయిందని అనుకుంటున్నారా ? వారికి నిజంగా ఇదో హెచ్చరికలాంటిదే. ఒకే ఊరిలో 33 మంది వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాలో చేగుర్తి గ్రామంలో రెండు రోజుల్లో ఈ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు పరీక్షలు చేయగా..మొదటి రోజు 16 కేసులు రాగా..రెండో రోజైన 17 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇదే గ్రామానికి చెందిన దుర్గం కనకయ్య (60) పది రోజుల క్రితం చనిపోయాడు.

గ్రామస్థులతో పాటు..చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. వారిలో ఒకరికి కరోనా ఉందని తేలడంతో గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ అని తేలింది. శుక్రవారం మరో 87 మంది పరీక్షలు చేయగా..17 మందికి కరోనా ఉందని వెల్లడైంది. గ్రామంలో మొత్తం 33 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ సూపర్ వైజర్ బాలయ్య వెల్లడించారు. వీరందరినీ హోం ఐసోలేషన్ లో ఉంచి అవసరమైన మందులు అందిస్తున్నట్లు, ఈ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు రోగులకు నిత్యావసర సరుకులను సమకూర్చుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే..గురువారం 23 వేల 761 నమూనాలను పరీక్షిస్తే..కొత్తగా 165 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 440 నమూనాల ఫలితాలు తెలియాల్సి ఉంది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2 లక్షల 97 వేల 278కి చేరింది. మహమ్మారితో మరొకరు చనిపోయారు. ఇప్పటి వరకు 1623 మంది కరోనాతో కన్నుమూశారు. వైరస్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 149గా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 35, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 19 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.