జనసేనతో దోస్తీని బీజేపీ ఎందుకు వద్దనుకుంది ?

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 12:21 AM IST
జనసేనతో దోస్తీని బీజేపీ ఎందుకు వద్దనుకుంది ?

Telangana BJP and Janasena : గ్రేటర్‌ ఎన్నికల్లో జనసేనతో పొత్తుకు నై.. సింగిల్‌గానే సై అంటోంది బీజేపీ. పొత్తు కోసం జనసేన స్నేహ హస్తం అందించినా.. కమలం కుదరదని కూల్‌గా ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ దోస్తీ కటీఫ్‌ వెనుక కమలం వెసుకున్న లేక్కలేంటి..? తెలంగాణలో జనసేనతో దోస్తీని బీజేపీ ఎందుకు వద్దనుకుంటోంది..?



జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటి చేస్తాయని ఇరు పార్టీల కేడర్ భావించింది. కానీ ఎక్కడో గ్యాప్ వచ్చి.. తేడా కొట్టింది. ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించడంతో పొత్తు లేదని తేలిపోయింది. దీంతో మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా బరిలోకి దిగబోతున్నాయి రెండు పార్టీలు.



ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉండటంతో.. తెలంగాణలోనూ పొత్తు ఉంటుందని భావించారంతా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని జనసేన ప్రకటించడంతో… బీజేపీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతుందనే వార్తలొచ్చాయి. అయితే తెలంగాణ బీజేపీ మాత్రం జనసేనతో పొత్తుకు అంతగా ఇష్టంగా లేనట్టు కనిపించింది.



బీజేపీతో పొత్తు లేకపోయినా.. సొంతంగా అయిన కొన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని జనసేన భావించింది. ఈ క్రమంలోనే తమ పార్టీకి సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో నిమగ్నమైంది. ఇంతలోనే పొత్తుకు సంబంధించిన చర్చలు జరుగుతాయని జనసేన ప్రకటించడం.. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని బండి సంజయ్ చెప్పడంతో గందరగోళం నెలకొంది.



జనసేనతో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని బీజేపీ భావిస్తోంది. 2023లో అధికారంలోకి రావాలనుకుంటున్న కమలం.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. మరోవైపు 150మంది అభ్యర్థుల పేర్లు దాదాపు ఫైనల్ కావడంతో.. జనసేనతో పొత్తు పెట్టుకుంటే టిక్కెట్ల సర్దుబాటు ఇబ్బందికరంగా మారుతుందన్నది బీజేపీ వాదనగా కనిపిస్తోంది. పైగా తెలంగాణను ఒక దశలో వ్యతిరేకించిన జనసేనానితో పొత్తు పెట్టుకుంటే అధికార పార్టీకి అవకాశం ఇచ్చినట్టవుతుందని కొంతమంది నేతలు వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. దుబ్బాక లాగే ఇక్కడ కూడా సింగిల్‌గానే బరిలోకి దిగితే మెరుగైన ఫలితాలు వస్తాయన్నది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే జనసేనను కాదని ఒంటరిగా పోటి చేసేందుకు మొగ్గు చూపింది.



మరోవైపు తెలంగాణ బీజేపీ జీహెచ్‌ఎంసీలో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను బుధవారమే విడుదల చేసింది. 21 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన భూపేంద్ర యాదవ్‌తో కలసి చర్చించిన అనంతరం బండి సంజయ్ ఈ పేర్లను ఖరారు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఆగమేఘాల మీద అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి.



మొత్తానికి పొత్తు ఉండదని బీజేపీ క్లారిటీ ఇవ్వడంతో అభ్యర్థుల్ని ఎంపిక చేసే పనిలో పడింది జనసేన. పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్‌.. 20మంది సభ్యులతో ఫస్ట్‌ లిస్ట్‌ రిలిజ్ చేసే అవకాశముంది.