లాభాలు పండిస్తున్న వేరుశనగ పంట.. తక్కువ సమయంలోనే పంట చేతికి

వేరుశనగ పంటకాలం రకాన్ని బట్టి 100 నుండి 120 రోజులు ఉంటుంది. ఎకరానికి 15 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.

లాభాలు పండిస్తున్న వేరుశనగ పంట.. తక్కువ సమయంలోనే పంట చేతికి

Groundnut Cultivation: అతివృష్టితోనో.. అనావృష్టితోనో ప్రతి ఏటా ఖరీఫ్‌ రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. రబీలోనైన ఆలోటు పూడ్చుకుందామని ఎంతో ఆశగా వేరుశనగ పంట సాగు చేస్తున్నారు రైతులు. అయితే పెరిగిన పెట్టుబడులు, సాగులో సరైన సలహాలు, సూచనలు ఇచ్చే అధికారులు లేక నష్టపోతున్నామంటున్నారు ఏలూరు జిల్లా రైతులు.

ఆరుతడి పంటల్లో వేరు శనగ ప్రధాన మైనదిగా చెప్పొచ్చు. నూనె గింజల పంటల్లోనూ వేరుశనగకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం పల్లి నూనెకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. మార్కెట్‌లో పల్లి నూనెకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని యాసంగిలో వేరుశనగ పంటను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని రైతులు రెండో పంటగా సాగుచేస్తున్నారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న పెట్టుబడులతో పంట సాగు గిట్టుబాటు కావడం లేదని ఏలూరు జిల్లా, చింతలపూడి గ్రామ రైతు కొండపల్లి కాళేశ్వరరావు అంటున్నారు. 10 ఏళ్లుగా వేరుశనగ పంటను సాగుచేస్తూనే ఉన్నా.. ఈ ఏడాది మాత్రం ఎరువులు, పురుగు మందులకు అధికంగా ధరలు పెరగడం.. ఇటు వాతావరణ మార్పుల కారణంగా చీడపీడల ఉధృతి ఎక్కువైందని వాపోతున్నారు.

Also Read: కూరగాయలతో పాటు కనకాంబరాల సాగు.. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడులు

వేరుశనగ పంటకాలం రకాన్ని బట్టి 100 నుండి 120 రోజులు ఉంటుంది. ఎకరానికి 15 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. మార్కెట్ లో కూడా క్వింటా ధర 8 నుండి 9 వేల వరకు పలుకుతుంది. ఎకరాకు పెట్టుబడి రూ. లక్ష వరకు అవుతుంది. అంటే పెట్టుబడి ఖర్చులో పోను నికర ఆదాయం 50 నుండి 60 వేల వరకు ఉంటుంది. ఇతర పంటలతో పోల్చితే కొంత మెరుగే అంటున్నారు రైతు.