ATM Vegetable Cultivation : 10 సెంట్లలో 20 పంటలు.. నెలకు రూ. 15 వేల ఆదాయం
ATM Vegetable Cultivation : ఈ మోడల్‌లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు. అందుకే విజయనగరం జిల్లాలో పలు గ్రామాల్లో ఏటీఎం మోడల్ ను పరిచయం చేస్తున్నారు.

Farmers get more profits through ATM Model Vegetable cultivation over year
ATM Vegetable Cultivation : పురుగు మందులు, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంలా మారుతోంది. ఈ నూతన వ్యవసాయం ఇప్పుడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఏటీఎం నే కార్యక్రమం ద్వారా 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది. ప్రతి నెలా కనీసం రూ.10–25 వేల ఆదాయం పొందే మార్గంగా ఉన్న ఈ విధానం చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ వరంలా మారింది.
వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి. పండ్లతోటలు సాగు చేసే రైతులు ఆయా పంటల నుండి దిగుబడి పొందాలంటే కనీసం ఒక సంవత్సరంపైనే ఎదురు చూడవలసి ఉంటుంది.
మామిడి, బత్తాయి లాంటి పంటలు సాగు చేసే రైతులయితే ఇలాంటి పండ్ల తోటలలో దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించటం, అంతర పంటలు సాగు చేయడం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాలలోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండే పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరోబడ్జెట్ విధానంలో ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏటిఎం మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు.
ఈ మోడల్‌లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు. అందుకే విజయనగరం జిల్లాలో పలు గ్రామాల్లో ఏటీఎం మోడల్ ను పరిచయం చేస్తున్నారు. గుర్ల మండలం, జమ్ముపేట గ్రామంలో చాలా మంది రైతులు ఈ ఏటీఎం మోడల్ లో కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ఓ రైతు 20 సెంట్ల స్థలంలో 20 రకాల పంటలు పండిస్తున్నారు. ఇంటి అవసరం పోగా.. మిగితావి అమ్ముకుంటున్నారు. నెలకు 10 నుండి 15 ఆదాయం పొందుతున్నారు.